News

బంగ్లాలో మరో ఇస్కాన్‌ ఆలయం ధ్వంసం

290views

బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇస్కాన్‌కు చెందిన మరో ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మందిరంలోని దేవతామూర్తుల విగ్రహాలు, ఇతర సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ మేరకు కోల్‌కతా ఇస్కాన్‌ ఉపాధ్యక్షుడు రాధారమణ్‌ దాస్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఢాకా జిల్లా ధౌర్‌ గ్రామంలో హరేకృష్ణ నామ్‌హట్టా సంఘానికి చెందిన రాధాకృష్ణ ఆలయం, మహాభాగ్య లక్ష్మీనారాయణ ఆలయాలకు తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య దుండగులు నిప్పు పెట్టారని పేర్కొన్నారు. భైరబ్‌ ప్రాంతంలోని ఇస్కాన్‌ ఆలయాన్ని ధ్వసం చేసిన వారం రోజుల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.

కాగా, బంగ్లాదేశ్‌లో హిందువుల దుస్థితిపై కాంగ్రెస్‌ పార్టీ మౌనంగా ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. బాధితుల్లో ఎక్కువమంది దళితులు, బలహీన వర్గాలకు చెందినవారేనని తెలిపారు. లఖ్‌నవూలో ఆమె విలేకరులతో మాట్లాడారు. విభజన సమయంలో కాంగ్రెస్‌ చేసిన తప్పిదం కారణంగా పొరుగు దేశంలో దళితులు ఇబ్బందులు పడుతున్నారని, వారిని భారత్‌కు రప్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దాడుల అంశాన్ని ప్రధాన ప్రతిపక్షం పార్లమెంట్‌లో లేవనెత్తకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. సంభాల్‌ హింస సాకుతో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, వాటి మిత్రపక్షాలు ముస్లిం ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు.