ArticlesNews

సామాజిక సౌభ్రాతృత్వం “బాలా సాహెబ్ దేవరస్”

87views

( డిసెంబరు 6 – బాలా సాహెబ్ దేవరస్ జయంతి )

మధుకర్ దత్తాత్రేయ దేవరస్ అంటే బాలా సాహెబ్ దేవరస్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మార్గశీర్ష శుక్ల పక్ష పంచమి నాడు జన్మించారు. గ్రెగోరియన్ క్యాలండర్ ప్రకారం 1915 డిసెంబరు 11న ఆయన జన్మించారు. మన భారతీయ క్యాలండర్ ప్రకారం ఈ సంవత్సరం డిసెంబరు 6న బాలా సాహెబ్ దేవరస్‌గారి జయంతిని నిర్వహించుకుంటున్నాము. ఒక సాధారణ కుటుంబానికి చెందిన కృష్ణారావు దేవరస్ , పార్వతీబాయి దంపతులకు జన్మించిన బాలా సాహెబ్ దేవరాస్ నాగ్‌పూర్‌లో తన ప్రారంభ విద్యను పూర్తి చేసి, న్యాయశాస్త్ర పట్టా తీసుకున్న తర్వాత, “అనత్ విద్యార్థి బస్తీ గృహ్”లో పిల్లలకు బోధించడం ప్రారంభించాడు. బాలా సాహెబ్ దేవరస్ కుటుంబం నాగ్‌పూర్‌లోని ఇట్వారీలో నివసించేది. 1925లో సంఘ ప్రారంభమైన తర్వాత ఆయన కూడా శాఖకు హాజరు కావడం మొదలు పెట్టారు. చాలా తక్కువ సమయంలోనే ఆయన డాక్టర్ జీకి కూడా దగ్గరయ్యారు. కొంత కాలం తర్వాత దేవరస్‌గారు నాగ్‌పూర్ నగర నిర్వాహకునిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 1965 నుంచి 1973 వరకు సర్‌కార్యవాహగా బాధ్యతలు నిర్వహించారు.

మధుకర్ దత్తాత్రేయ దేవరస్ గారు సంఘతో పాటు ప్రపంచానికి బాలా సాహెబ్ దేవరాస్‌గానే సుపరిచితం. డాక్టర్ హెడ్గేవార్ జీతో కలిసి నాగ్‌పూర్ మొదటి శాఖ ‘మోహితే బడా’ నుండి సంఘాన్ని ప్రారంభించినవారిలో బాలా సాహెబ్ దేవరస్ ఒకరు. దేవరస్ జీ స్వయంగా డాక్టర్ జీ వద్ద శిక్షణ పొందారు. అందుకే, చాలా మంది స్వయంసేవకులకు బాలా సాహెబ్ దేవరస్‌లో డాక్టర్ సాహెబ్ దర్శనం ఇస్తారు. దేవరస్ ఉన్నత చదువులు అభ్యసించి ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేయాలని ఆయన కుటుంబం కలలు కనేది. కానీ, ఆయనకు మాత్రం దేశానికి సేవ చేయాలనే ఆలోచన మాత్రమే ఉండేది. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ కన్ను సంఘ్ పై పడింది. సంఘ్‌ను నిషేధించింది. స్వయంసేవకుల అరెస్టులు ప్రారంభం అయ్యాయి. అయితే బాలా సాహెబ్ దేవరస్ తన సంకల్ప బలంతో సంఘాన్ని ముందుండి నడిపించారు. స్వయం సేవకుల కోసం పోరాడారు.

1932 సంవత్సరం నాటికి, బాలా సాహెబ్ దేవరాస్ సంఘలో విశేష భూమికను పోషించడం ప్రారంభించారు. సంఘ కార్యకలాపాలతో పాటు సామాజిక సేవలో ఆయన ముందుండేవారు. సర్సంఘచాలక్ డాక్టర్ హెడ్గేవార్ జీ అభ్యర్థన మేరకు, ఆయన అనాథ పాఠశాలలో పిల్లలకు బోధించడం ప్రారంభించాడు. 1937లో పూణేలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శిక్షణా శిబిరం జరుగుతుండగా, ఆ సమయంలో దేవ్‌రాస్‌కు ప్రధాన ఉపాధ్యాయునిగా 40 రోజులు శిక్షణ ఇచ్చేవారు. ఈ ప్రశిక్షణ వర్గ తర్వాత కార్యవాహగా నాగ్‌పూర్ ముఖ్య శాఖ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో 15 కొత్త శాఖలు ప్రారంభం అయ్యాయి.

నిబద్ధత, నిజాయతీతో పాటు దేవరస్‌గారు దేశభక్త పరాయణుడు కావడంతోనే ఆయన స్వయంసేవక సంఘ్ జీవితకాల స్వయంసేవకునిగా ఉన్నారు. గురూజీ మరణానంతరం ఆయన కోరిన విధంగా బాలా సాహెబ్ దేవరస్ గారికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్సంఘచాలక్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే సంఘ్‌కు నూతన దిశ వచ్చింది అలాగే చాలా వేగంగా అభివృద్ధి సాధించింది. సంఘ సేవాకార్యక్రమాలపై దేవరస్ జీ ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పేద, వెనుకబడిన ప్రజల అభ్యున్నతికి పెద్ద పీట వేశారు. బాలా సాహెబ్ దేవరస్ గారు సంఘలో చేసిన మార్పులు నేటికీ కొనసాగుతున్నాయి. నేడు, దేశవ్యాప్తంగా 365 రోజుల పాటు శాఖలు జరుగుతున్నాయంటే, ఆదివారం సైతం అత్యధిక సంఖ్యలో శాఖలు పని చేస్తున్నాయంటే అందుకు కారణం దేవరస్ గారే. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌లో ఘోష్ ,’సమూహ గానం’ అభ్యాసం కూడా బాలా సాహెబ్ దేవరస్ నాయకత్వంలో ప్రారంభమైంది.

అప్పట్లో దేశంలో కుల వివక్ష ఎక్కువగా ఉండేదని, అన్ని సమాజాలు, కులాల వారు విడివిడిగా జీవించేవారు. అయితే బాలా సాహెబ్ దేవరాస్‌గారికి కుల పట్టింపులు ఉండేవి కావు. అంటరానితనం నేరం కాకపోతే ప్రపంచంలో ఇంకేది నేరం కాదని అనేవారు ఆయన. సామాజిక సమానత ఆవశ్యకతను వివరిస్తూ వారు చేసిన ప్రసంగం “సామాజిక సమానత – హిందూ సంఘటన” నేటి హిందూ సమాజానికి ఆచరణీయం. వారి ఆశయం మేరకే గుంటూరు వద్ద నూతక్కిలో అనాథ పిల్లల కోసం మాతృఛాయ ప్రారంభం అయింది. అలాగే హైదరాబాదులో వైదేహి, వాత్సల్య సింధు వంటి సేవా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన మధుకర్ దత్తాత్రేయ దేవరస్ గారు తన చివరి రోజుల్లో సైతం సంఘకు దిశ నిర్దేశం చేస్తూ 1966 జూన్ 17న అస్తమించారు. ఆ దివ్యాత్ముడిని మన ముందు తరాలు సైతం స్మరించుకుంటూనే ఉంటాయి.