( డిసెంబర్ 6 – భగవాన్ శ్రీ కాశిరెడ్డి నాయన వర్ధంతి )
‘‘పేదవాడి ఆకలి తీర్చడం, లేనివాడి కడుపు నింపడం… ఇదే నిజమైన మాధవ సేవ!’’ అని బోధించిన అవధూత కాశిరెడ్డి నాయన. కష్టాలు తీర్చే పెన్నిధిగా ఎందరికో ఆరాధ్యుడైన ఆధ్యాత్మిక గురువు. సామాన్యులను ఆదుకోవడం కోసం జీవితాంతం పాటుపడిన మహనీయునిగా ప్రసిద్ధి చెందిన కాశిరెడ్డి నాయన అసలు పేరు మున్నళ్లి కాశిరెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసుపల్లిలో సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు.
ఒకవైపు ఆటపాటలూ, మరోవైపు ఆధ్యాత్మిక చింతనతో మున్నళ్లి కాశిరెడ్డి బాల్యం గడిచింది. పదహారేళ్ళ వయసులో చదువు చాలించి, వ్యవసాయ పనులు చేపట్టారు. ఒకసారి వేపచెట్టు కింద కాశిరెడ్డి కూర్చొని ఉండగా, ఆయనకు అంతర్వాణి దిశా నిర్దేశం జరిగింది. సొంత ఊరు నుంచి ప్రకాశం జిల్లా వెలుగొండ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ అతిరాచ గురవయ్య స్వామిలో ఆయనకు సద్గురు సాక్షాత్కారం అయింది. గురవయ్య స్వామి శిష్యరికంలో మంత్రోపదేశం పొందారు. తన గమ్యమేమిటో అవగతం అయింది. గురువు సూచన మేరకు తీర్థయాత్రలు ప్రారంభించారు. కన్యాకుమారి మొదలు కాశీ వరకూ దేశంలో కాశిరెడ్డి దర్శించని క్షేత్రం లేదు. కాశీలో మూడేళ్ళు గడిపారు. గరుడాద్రి వద్ద పన్నెండేళ్ళు తపస్సు చేశారు. తరువాత పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అన్న దానం, గోసేవ, ఆలయాల జీర్ణోద్ధరణలపై విస్తృతంగా ప్రచారం చేశారు.
‘‘అమ్మా.. ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టండి. శక్తి లేకపోతే గంజి పోయండి. పది మంది అన్నం ఒక్కరు తినకూడదు. నలుగురికి సరిపోయే అన్నం పది మంది పంచుకోవాలి!’’ అని కాశినాయన బోధించేవారు. నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో ఎందరినో ఆదుకున్నారు. నీడనిచ్చారు. ఆకలి తీర్చారు. కష్టాలలో తోడూనీడగా నిలిచారు. భక్తులు ఆయనను తండ్రిగా భావించేవారు. కాశిరెడ్డి నాయన అని ఆప్యాయంగా పిలుచుకొనేవారు. కాశిరెడ్డి నాయన ఎన్నో ఆలయాలను పునరుద్ధరించారు. నెల్లూరు జిల్లాలోని క్రీ.శ 1406 నాటి ఘటిక సిద్ధేశ్వరాలయం 1974లో ఆయన చేతుల మీదుగా పూర్వవైభవం సంతరించుకుంది. కాశి నాయన 1995 డిసెంబర్ 6న పరమపదించారు.
కాశిరెడ్డి నాయన సమాధి ఉన్న కడప జిల్లా నరసాపురం మండలంలోని జ్యోతి క్షేత్రం నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. ఇది కడప జిల్లా ఆళ్ళగడ్డకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నిరంతర అన్నదాన యజ్ఞం కొనసాగుతూ ఉంటుంది. ఏ సమయంలో వెళ్ళినా ఆదరించి, అన్నం పెట్టడం దీని విశిష్టత. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు ఇక్కడకు వస్తూ ఉంటారు. కాశినాయన పేరిట రాయలసీమ ప్రాంతంలో వందకు పైగా ఆశ్రమాలు నడుస్తున్నాయి. అన్నదానంతో పాటు గోసంరక్షణకు కూడా ఇవి పాటుపడుతున్నాయి. వీటిలో తిరునాళ్ళతిప్ప ఆశ్రమం ఒకటి. ఇది అనేక ఆలయాల సముదాయంతో, పవిత్ర క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. అలాగే, మహారాష్ట్రలోని షిరిడి నుంచి నాగర్‌సోల్ వచ్చే దారిలో, కర్నూలు, కడప, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఎన్నో దేవాలయాలు, ఆశ్రమాలు అన్నార్తులను ఆదుకుంటున్నాయి. భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ దీన జనసేవ, గోసేవ, శిథిలమైన దేవాలయాల జీర్ణోద్ధరణ చేస్తూ ఆజన్మాంతం ఆధ్యాత్మిక మార్గమే శరణ్యమని ఆచరణలో చూపిన మహనీయుడు కాశిరెడ్డి నాయన మనకు సదా స్మరణీయులు.