బంగ్లాదేశ్‌లో ఉద్రికతల నేపథ్యంలో త్రిపురలోని అగర్తలాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్ని వీసా, కాన్సులర్ సేవలను నిలిపివేస్తున్నట్టు అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హై కమిషన్ ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. భద్రతా కారణాల రీత్యా వీసా, కాన్సులర్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది.
ఏం జరిగింది?
బంగ్లా పోలీసులు అరెస్టు చేసిన హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్‌ను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ అగర్తలాలో కొందరు ఆందోళనకారులు బంగ్లా అసిస్టెంట్ కార్యాలయాన్ని సోమవారంనాడు ముట్టడించారు. బంగ్లాలో హిందువులపై దాడులకు వ్యతిరేకంగా నిరననలు తెలిపింది. దీనిపై స్థానిక పోలీసులు వెంటనే సుమోటో కేసు నమోదు చేయడంతో పాటు సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించిన ఏడుగురుని అరెస్టు చేసింది. విధి నిర్వహణలో అలసత్యం చూపిని నలుగురు పోలీసులను మందలించడంతో పాటు, ముగ్గురు సబ్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేసింది. సెక్యూరిటీ ఉల్లంఘనలు జరిగిన ఈ ఘటనపై భారత ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది.
భారత హైకమిషనర్‌కు సమన్లు
కాగా, అగర్తలాలో చోటుచేసుకున్న పరిణామాలపై బంగ్లాలోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు అక్కడి ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. దీంతో ప్రణయ్ వర్మ అక్కడి అధికారులను కలిసారు. బంగ్లాతో సంబంధాల బలోపేతానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.