
జామియా మిలియా ఇస్లామియా (JMI) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మజహర్ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలోని జామియా క్యాంపస్‌లో ఆర్‌ఎస్‌ఎస్ (RSS) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువ కుంభ్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా భారతీయుల మూలాల గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
భారతీయులందరి డీఎన్‌ఏ (DNA) ఒక్కటేనని, అది ‘మహాదేవుని డిఎన్‌ఏ’ అని వ్యాఖ్యానించారు. అక్కడ ఉన్న విద్యార్థులను ఉద్దేశిస్తూ.. “మీ అందరి మాతృభాషలు వేరు కావచ్చు, మీ సంప్రదాయాలు, సంస్కారాలు వేరుగా ఉండవచ్చు, కానీ మనమందరం భారతీయులం. ఎందుకంటే మన రక్తం, మన డీఎన్‌ఏలో పరమశివుని తాలూకు అంశ ఉంది” అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే సనాతన సంస్కృతి అత్యుత్తమమైనదని, అది అందరి హితాన్ని కోరుకుంటుందని కొనియాడారు.
వైస్ ఛాన్సలర్ తన వాదనను సమర్థించుకోవడానికి శివుని కుటుంబాన్ని ఒక అద్భుతమైన ఉదాహరణగా చూపారు. కైలాస పర్వతంపై ఉండే మహాదేవుని కుటుంబంలో పరస్పర విరుద్ధమైన జీవులు ఎంతో సామరస్యంగా ఉంటాయని వివరించారు. “శివుని మెడలో పాము ఉంటుంది. వినాయకుడి వాహనం ఎలుక. పార్వతీ దేవి వాహనం సింహం. కార్తికేయుడి వాహనం నెమలి. అలాగే శివుని ముందు నంది ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా చూస్తే పాముకి ఎలుక ఆహారం, నెమలికి పాము ఆహారం, సింహానికి నంది ఆహారం. ఒకరికొకరు శత్రువులైనప్పటికీ.. వీరంతా మహాదేవుని ఇంట్లో కలిసికట్టుగా ఉంటారు. విభిన్న జాతులు, మతాలు, వర్గాలకు చెందిన మనం భారతీయులుగా కలిసి ఉండాలనేది సనాతన సంస్కృతి నేర్పే గొప్ప పాఠం” అని ప్రొఫెసర్ మజహర్ ఆసిఫ్ స్పష్టం చేశారు.





