News

హిందువులపై దాడులు..బంగ్లాదేశ్‌కు అమెరికా కీలక సూచన

President Joe Biden speaks at the Summit on Fire Prevention and Control in the South Court Auditorium on the White House complex in Washington, Tuesday, Oct. 11, 2022. (AP Photo/Susan Walsh)
93views

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఆందోళకర పరిణామాలపై అగ్రదేశం అమెరికా స్పందించింది. పౌరుల ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి అమెరికా సూచించింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో దేశంలో మత,ప్రాథమిక,మానవ హక్కులను గౌరవించాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని అమెరికా కోరింది.

ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ డిసెంబర్‌4 మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలన్నీ చట్టాలను గౌరవించాల్సిందేనన్నారు. నిర్బంధంలో ఉన్నవారికి కూడా ప్రాథమిక స్వేచ్ఛనిస్తూ వారి మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలని పటేల్‌ కోరారు.

కాగా, బంగ్లాదేశ్‌లో షేక్‌హసీనా ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు మొదలైన విషయం తెలిసిందే. ఇటీవల హిందు మతానికి చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ను కూడా అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. చిన్మయ్‌ తరపున కేసు వాదించేందుకు వచ్చిన న్యాయవాదిపైనా దాడి జరగడం బంగ్లాదేశ్‌లో దిగజారిన పరిస్థితులను తెలియజేస్తోంది.