కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలను చేయాలని భావించి, ఆయనే ఇప్పుడు ఇరుక్కున్నారు. పేజావర్ పీఠాధిపతులు శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ అనని మాటలను అన్నట్లు ప్రచారం చేశారు ముఖ్యమంత్రి. ఇప్పుడు స్వామీజీ అబద్ధపు ప్రచారంపై సీఎం సిద్ధరామయ్యను దుయ్యబడుతున్నారు. రాజ్యాంగం విషయంలో తాను అనని మాటలను అన్నట్లు ఎలా ఆపాదిస్తారంటూ స్వామీజీ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాటలు పూర్తిగా రెచ్చగొట్టేలా వున్నాయని, తప్పుదోవ పట్టించేలా వున్నాయని స్వామీజీ మండిపడ్డారు.సిద్దరామయ్య వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని ప్రకటించారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని స్వామీజీ పిలుపునిచ్చారంటూ అసత్య, సత్యదూర ఆరోపణలు చేశారు సిద్దరామయ్య. దీనిపై స్వామీజీ సీరియస్ గా స్పందించారు. తాను అలాంటి ప్రకటనలు ఎప్పుడూ చేయలేదని స్వామీజీ తేల్చి చెప్పారు. ఓ బాధ్యతాయుత స్థానంలో వున్న ముఖ్యమంత్రి… వాస్తవాలను ధ్రువీకరించడంలో ఘోరంగా విఫలం చెందారంటూ మండిపడ్డారు.
బెంగళూరులో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీల సదస్సు జరిగింది. ఈ సదస్సులో పెజావర్ స్వామీజీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెజారిటీ ప్రయోజనాలను ప్రతిబింబించే రాజ్యాంగం వుంటే బాగుంటుందంటూ ఓ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలు అందర్నీ కలుపుకొని వెళ్లాలని, పౌరులందర్నీ సమానంగా చూడాలని మాత్రమే తాను డిమాండ్ చేశానని పేర్కొన్నారు. హిందువుల ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాను కాబట్టే కొన్ని వర్గాలు తనను లక్ష్యంగా చేసుకున్నాయని స్వామీజీ పేర్కొన్నారు.ఈ సమావేశం తర్వాత గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ని కలిసి, సమర్పించిన మెమోరండంలో కూడా రాజ్యాంగ మార్పుల గురించి తాము ప్రస్తావించనే లేదని స్వామీజీ స్పష్టం చేశారు.
తాను.. రాజ్యాంగాన్ని మార్చాలని మాత్రం అనలేదు. కానీ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిలో కూడా రాజకీయాలను చొప్పించి, రాజ్యాంగం మార్చాలనే పెజావర్ స్వామీజీ డిమాండ్ చేసినట్లు తప్పుడు వ్యాఖ్యలు చేశారు. తాను రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, దానికి వ్యతిరేకంగా ఎలాంటి పనికీ చొరవ తీసుకోలేదని, మద్దతు కూడా ఇవ్వనని స్వామీజీ తేల్చిచెప్పారు. రాజ్యాంగాన్ని కూడా ఎన్నడూ దాటలేదని, ఉల్లంఘించలేదని కూడా స్పష్టం చేశారు. అలాగే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ.. ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కను వినియోగించుకుంటానని, రాజ్యాంగ విరుద్ధమైన చర్యకు ఎన్నడూ పాల్పడలేదని ప్రకటించారు. సమాజంలోని అన్ని వర్గాలతో ప్రేమగానే నడుచుకుంటున్నానని, సమాజంలోని బలహీన వర్గాలకూ నిరంతరం సేవ చేస్తూనే వున్నానని తెలిపారు. అలాగే వారు నివసించే ప్రాంతాలకు కూడా వెళ్తామని, వారికి ఇళ్లు కూడా నిర్మిస్తామన్నారు. ఇటీవలే 16 లక్షలతో 14 ఇళ్లు నిర్మించామని మరో 100 ఇళ్లకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశామన్నారు.
రాష్ట్రంలోని దేవాలయాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై కూడా పెజావర్ స్వామీజీ తీవ్రంగా మండిపడ్డారు. 10 లక్షల ఆదాయం ఉన్న ఆలయాలపై 5 శాతం పన్ను, రూ. కోటి ఆదాయం ఉన్న ఆలయాలపై 10 శాతం పన్ను విధిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇతర మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు స్వతంత్రంగా వుంటే.. హిందూ దేవాలయాలను మాత్రం తమ అదుపులో వుంచుకునేందుకు కర్నాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అర్చకులకు కూడా సరైన వేతనాలను చెల్లించడం లేదని, ఈ వివక్ష ఎందుకో చెప్పాలని స్వామీజీ డిమాండ్ చేశారు.