
ఆగస్టు 5, 2019 స్వతంత్ర భారత చరిత్రలో మరపురాని రోజు. ఏడు దశాబ్దాలకు పైగా నలుగుతున్న ఒక జాతీయ సమస్యకు పార్లమెంట్ ఒక పరిష్కారం చూపిన రోజు. రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసే నిర్ణయం హోంమంత్రి అమిత్ షా ప్రకటించి, సమర్ధిస్తున్న సమయంలో, ఆపైన లోక్ సభ ఆమోదం పొందుతున్న వేళ కోట్లాది మంది భారతీయులు టెలివిజన్ తెర ముందు కూర్చుని, పార్లమెంట్ ఆమోదం లభించిందని తెలియగానే ఆనందంతో చిందులు వేశారు.
అలా ఆనందంతో ఉప్పొంగిపోయిన భారతీయులలో ఒక్కరు మాత్రం విశేష వ్యక్తి. ఆయనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీ ఘంటా వెంకట సీతారామయ్య. కృష్ణా జిల్లా మైలవరం వాస్తవ్యులు. ఆగస్టు 5న ఆ వార్త వింటున్న సీతారామయ్య కంటి వెంట ఆనందభాష్పాలు ఆగలేదు. మనసు ఉద్వేగానికి గురైంది. అవును ఆర్టికల్ 370 అంశానికి సంబంధించిన పోరాట ప్రారంభ, ముగింపు అంకాలకు ఏకైక సాక్షి సీతారామయ్య. ఇప్పుడు ఆయన వయస్సు 94 ఏళ్లు. ఆయనతో ఇంటర్వ్యూ హిందూనగారా పాఠకులకి ప్రత్యేకం…

హిం. న : నమస్కారం సీతారామయ్య గారూ.
సీ.రా : నమస్కారం, రండి. కూర్చోండి. (లేవబోయారు. వద్దని వారించాం.)
కుశల ప్రశ్నలు, పరిచయాలు అయింతర్వాత.
హిం. న : మీ కుటుంబ నేపథ్యం, రాష్ట్రీయ స్వయంసేవక సంఘంతో పరిచయం తదితరాలు వివరించగలరా?
సీ.రా : మా కుటుంబం సత్తు గిన్నెలు అమ్ముకునే వ్యాపారం చేసేది. ఒకరిద్దరు దర్జీలుగా పని చేసేవారు. ఆర్ ఎస్ ఎస్ పురుడు పోసుకున్న 1925 లోనే నేను పుట్టాను. నా పదవ ఏట నుండి శాఖకి వెళ్ళడం మొదలుపెట్టాను. అప్పుడు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాను. ఆ కాలంలో ఆంధ్ర ప్రాంతానికి ప్రచారక్ గా వచ్చిన గోపాల్ రావు ఠాకూర్ గారి వల్లనే సంఘంతో నా అనుబంధం బలపడింది. ఆయన మార్గంలోనే నా జీవితాన్ని బ్రహ్మచారిగా దేశానికి అంకితం చేయాలనుకున్నాను.
హిం. న : ఆర్టికల్ 370 వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడం ఎలా జరిగింది?
సీ.రా : జన సంఘ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో 1953లో కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయాలంటూ ఒక పోరాటం జరిగింది. ఆయన పిలుపు మేరకు వేలాది మంది పోరాటంలోకి దిగారు. ‘ ఏక్ దేశమే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ చలేగా’ అంటూ త్రివర్ణ పతాకాలు పట్టుకుని కాశ్మీర్ లోకి ప్రవేశించాలన్నది ఆ ఉద్యమ లక్ష్యం.
ఆ ఉద్యమంలో పాల్గొనేందుకు ఆంధ్ర ప్రాంతం నుంచి మొత్తం 12 మంది రెండు జట్లుగా వెళ్లారు. రెండవ జట్టులోని ఆరుగురు సభ్యులలో నేను ఒకడిని. మా జట్టుకు పైడిమళ్ళ సుబ్బరామయ్య శాస్త్రిగారు నాయకులు. నాతోపాటుగా జమలయ్య, తెనాలికి చెందిన దత్తాత్రేయులు, గుంటూరు నగర వాసి వీరగంటి సూర్యనారాయణ, అప్పల భద్రాద్రి మిగిలినవారు.
హిం. న : పేద కుటుంబం నుంచి వచ్చి పెద్దగా చదువుకోని మీకు ఎక్కడో సుదూర ప్రాంతమైన కాశ్మీర్లోని ఒక సమస్యపై స్పందన ఎలా కలిగింది?
సీ.రా : యావద్దేశము మన ఇల్లు. దేశంలో ఎక్కడ, ఏ మూల సమస్య వచ్చినా అది మనకు వచ్చిన సమస్యగానే భావించాలి. దానికి తగిన విధంగా స్పందించాలి. రాష్ట్రీయ స్వయంసేవక సంఘంతో అనుబంధం వల్ల మాకు దేశం పట్ల ఏర్పడిన కల్పన ఇది.
కాశ్మీర్ సుదూరంలో ఉందని గానీ, హిందీ సరిగా రాదనిగాని మాకనిపించలేదు. అరెస్టయితే జీవితం ఏమవుతుందోనన్న భయం లేదు. సంఘం పిలుపు ఇచ్చింది. ఉద్యమంలోకి వెళ్లాలి. కాశ్మీర్ అంశం ఎంతో ఉత్తమం, కీలకం కాకుంటే ఇంత దూరంలో ఉన్న వారికి పిలుపు రాదు కదా? అని అనుకున్నానంతే. అయినా దేశం కోసం, సంఘం నిర్దేశించిన కార్యక్రమంలో ప్రాణం పోతేనేమండీ?
హిం. న : అక్కడికి వెళ్ళాక మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఎలా తిరిగొచ్చారు?
సీ.రా : ఆంధ్ర నుండి వెళ్ళిన మా సంఘ కార్యకర్తల బృందం ఢిల్లీ స్టేషన్లో దిగిన తర్వాత, దేశంలోని ఇతర ప్రాంతాల స్వయంసేవకులతో కలిసి బస్సుల్లో కాశ్మీర్ వైపు బయలుదేరాం. అప్పటికే తొలి బృందం జమ్మూ వైపు వెళ్లింది.
అది మే నెల. మేం ప్రయాణం చేస్తున్న బస్సు పఠాన్ కోట్ చేరగానే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. తిరిగి ఢిల్లీకి తీసుకు వచ్చారు. ఆ సమయంలోనే శ్యాం ప్రసాద్ ముఖర్జీని బంధించి శ్రీనగర్ జైలుకు తీసుకువెళ్లారని తెలిసింది. ఢిల్లీలో పదిహేను రోజులు రిమాండ్లో ఉంచారు. ఆ సమయంలో ధర్నా చేయడంతో కోర్టుకి తీసుకెళ్లారు. కోర్టు నెల రోజులు శిక్ష విధించింది. యూపీలోని రాంపూర్ సెంట్రల్ జైలుకు పంపించారు. ఆ జైలులో ఖైదీగా ఉన్న సమయంలోనే మాకు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన వార్త తెలిసింది. ఆయనకు విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపారని ఒక నర్స్ చెప్పింది. ఆ నెల రోజుల శిక్ష తర్వాత జైలు నుంచి వచ్చి తిరిగి మైలవరం చేరుకున్నాను.
హిం. న : ఆ తర్వాత ఏం చేశారు?
సీ.రా : . నాటినుండి జన సంఘ్ లో, ఆర్ఎస్ఎస్ లో ఉత్సాహంగా పని చేశాను. జనసంఘ్, బీజేపీ తరపున అనేక ఎన్నికలలో పనిచేశాను. (1952 నుండి అన్ని ఎన్నికల వివరాలు ఆయనకు గుర్తున్నాయి. మైలవరంలో పోటీ చేసిన జన సంఘ్ అభ్యర్థుల పేర్లు, వారికి వచ్చిన ఓట్ల సంఖ్య స్వయంగా చెప్పారు.)
హిం. న : ప్రస్తుతం మీ కుటుంబ పరిస్థితి ఏమిటి?
సీ.రా : నాకు నలుగురు పిల్లలు. ఈ ఇల్లు మా చిన్నమ్మాయిది. (ఒక చిన్న గది, రేకుల వసారా, వర్షం వస్తోంది అప్పుడు. ఇళ్ళు కురుస్తున్నది. అయినా అలానే తడుస్తూ మాతో మాట్లాడారు.) చిన్న కొడుక్కి నా అభిమాన నాయకుడు వాజపాయ్ పేరు పెట్టుకున్నాను. తాపీ పని చేస్తున్న వాజపాయే ఇప్పుడు మా కుటుంబానికి ఆధారం.
హిం. న : దేశ సేవా కార్యంలో మునిగి కుటుంబానికి ఎక్కువ సమయం వెచ్చించలేకపోయానని మీకు ఎప్పుడైనా అనిపించిందా?
సీ.రా : (తడుముకోకుండా) ఎప్పుడూ లేదు. ఆర్. ఎస్. ఎస్ ఇచ్చిన సంస్కారంతో మాకున్నంతలో గౌరవంగా బ్రతికాం. దేశం కోసం తమ జీవితాల్ని సమర్పించిన గోపాలరావు ఠాకూర్ లాంటి మహానుభావుల సాంగత్యం లభించింది. ఎందరో గొప్ప వ్యక్తులతో కలసి పని చేసే అదృష్టం లభించింది. అంతకంటే ఏం కావాలి? నా జీవితంలో నాకు కొరత, బాధ ఏదైనా ఉందంటే అది నా పూర్తి జీవితాన్ని ఆర్ఎస్ఎస్ ద్వారా దేశానికి అంకితం చెయ్యలేకపోయానన్నదే.
- కాశ్మీర్ విమోచన ఉద్యమంలో పాల్గొన్న సాహసి శ్రీ సీతారామయ్య. ఆయన చివరిగా చెప్పిన ఈ మాటతో ఆయన నిస్వార్ధ, నిష్కళంక దేశ భక్తుడన్న విషయం నిర్ధారణ అయిపొయింది. నిజానికి ఆ వయసులో, అంతటి నిరుపేద పరిస్థితులలో కూడా ఆయనలో తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం, మాటలలో వ్యక్తమౌతున్న ఆత్మ గౌరవం, వయసు తరిగినా వన్నె తరగని ఆయనలోని దేశభక్తి మాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటె సంఘ గంగలో మునిగినవారెవరైనా అంతటి పునీతులు కాక తప్పదు. ఏదేమైనా సీతారామయ్య భారతమాత ముద్దుబిడ్డ.
సేకరణ : శ్రీ దుగ్గరాజు శ్రీనివాస రావు.
(‘హిందూ నగారా’ మాసపత్రిక సౌజన్యంతో)





