ArticlesNews

పోలి పాడ్యమి రోజు.. ఇలా చేస్తే..

251views

(డిసెంబర్ 02 – పోలి పాడ్యమి)

కార్తిక మాసం. శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది. నిన్నటితో ఈ మాసం వెళ్లిపోయింది. ఈరోజు నుంచి మార్గ శిర మాసం. అంటే విష్ణువుకు ఇష్టమైన మాసం. ఈ మాసంలో తొలి రోజు.. పోలి పాడ్యమి.

పోలి పాడ్యమి రోజు.. ఇలా చేస్తే..
మాసాల్లో.. మార్గశిరాన్ని నేను అని చెప్పాడు గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు. తొలి రోజు.. నుంచి మాసాంతం వరకు అన్ని శుభ తిథులే. అయితే మొదటి రోజు.. అంటే 2024, డిసెంబర్ 02వ తేదీ పోలి పాడ్యమి. ఈ రోజు పోలి బొందితో స్వర్గానికి వెళ్లిన రోజు. ఈ రోజు తెల్లవారుజామునే మహిళలు స్నానమాచరించి.. నదులు, చెరువులలో దీపాలు వదులుతారు. దీప దానం కూడా చేస్తారు.

చివరి రోజు శివాలయానికి వెళ్ళి మహాశివునికి అభిషేకాలు, పూజలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు. ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు. అలాగే పోలి పాడ్యమి రోజు 30 వత్తులతో దీపాలను వెలిగిస్తారు. అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అనంతరం మూడు సార్లు నీటిని తోస్తూ నమస్కరించుకుని పోలి స్వర్గం కథ వింటారు.

పోలి కథ

పూర్వ కాలంలో కృష్ణా తీరంలో ఓ ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలు పోలికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. కానీ అది ఆమె అత్తకు అసలు నచ్చేది కాదు. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్త అనుకుంటూ ఉండేది. అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగతా నలుగురు కోడళ్లతో పూజలు, వ్రతాలు చేయించేది. కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడలిని మినహా మిగతా వారందరినీ గుడికి తీసుకెళ్లింది.

చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రి ఉండనిచ్చేది కాదు. కానీ పోలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకుని వత్తులు చేసుకునేది. కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికి కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది. ఇలా కార్తీకమాసం అంతా చేసింది. మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడళ్ళతో గుడికి వెళ్తూ పోలికి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది. కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకుని దీపం వెలిగించింది.

ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచి పెట్టలేదు. ఆమె భక్తికి దేవతలు మెచ్చి.. ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి తీసుకు వెళ్లేందుకు పుష్పక విమానాన్ని తీసుకు వచ్చారు. గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త, మిగతా తోడికోడళ్ళు .. తమ కోసమే వారు వచ్చారని అనుకుంటారు. కానీ వాళ్ళను కాకుండా పోలిని తీసుకెళ్తుంటే అత్త, మిగిలిన తోడి కోడళ్ళు ఆమె కాళ్ళు పట్టుకుని వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించవు. కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలిని తీసుకు వెళ్తారు.

అయితే పోలి పాడ్యమి రోజు 30 వత్తులతో దీపం వెలిగించాలని శాస్త్ర పండితులు చెబుతారు. దీని వల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం కలుగుతుందని అంటారు. అలాగే ఈ రోజు దీప దానం చేయడం కూడా చాలా మంచిదని వారు వివరిస్తున్నారు.