ArticlesNews

ఆంధ్ర మహాభారతం పల్నాటి యుద్ధం

324views

( నవంబరు 30 నుంచి డిసెంబరు 4వరకు పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలు)

పల్నాటి యుద్ధం.. రాజ్య కాంక్షతో కౌరవ, పాండవులు జరిపిన మహాభారత యుద్ధం తీరున సాగింది. మాయా జూదంలో ఓడిన పాండవులు అరణ్య, అజ్ఞాత వాసం గడిపారు. ఆ తర్వాత తిరిగొచ్చిన పాండవులు రాజ్యం కోసం రాయభారం నడిపినా సంధి కుదరక యుద్ధం అనివార్యమైంది. పల్నాడు యుద్ధంలోనూ అలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. ఇద్దరు అన్నదమ్ములు రాజ్యకాంక్షతో జరిగిన పోరే ఆంధ్ర మహాభారతంగా పిలిచే పల్నాటి యుద్ధం..

క్రీ.శ.1138లో అనుగురాజు మహాదేవిచర్ల (పల్నాడు జిల్లా, మాచర్ల)ను రాజధానిగా చేసుకుని పాలించాడు. ఆయన మృతితో సవతి పుత్రుల మధ్య విభేదాలు తలెత్తాయి. మాచర్ల, గురజాల రాజ్యాలుగా విడిపోయాయి. మలిదేవాదులు మాచర్లను రాజధానిగా చేసుకుని మంత్రి బ్రహ్మనాయుడు (బ్రహ్మన్న) సారథ్యంలో పాలన ప్రారంభించాడు. గురజాలను రాజధానిగా చేసుకుని నాగమ్మ మంత్రిత్వంలో నలగాముడు పాలన చేపట్టాడు. ఇద్దరు ప్రజా సంక్షేమమే పరమావధిగా సంస్కరణలకు బీజాలు వేశారు. ఈ క్రమంలోనే సరదాగా సాగిన కోడిపందేలు ఇరు రాజ్యాల మధ్య వైషమ్యాలను బట్టబయలు చేశాయి. పట్టుదలకు పోయిన ఇద్దరు రాజులు కోడిపోరుకు దిగారు. క్రీ.శ.1173లో రాజ్యాలను పందేలుగా పెట్టారు. నాగమ్మ కుయుక్తితో కోడి పందెంలో గురజాల రాజ్యాన్ని గెలిపించి, మాచర్ల రాజైన మలిదేవాదులు, ఆయన మంత్రి బ్రహ్మన్న పరివారాన్ని అరణ్యవాసం పంపించారు. ఏడేళ్లు అరణ్య, ఏడాదిపాటు అజ్ఞాత వాసం అనంతరం తిరిగి రాజ్యాన్ని కోరేందుకు అలరాజు ద్వారా జరిపిన సంధి విఫలమైంది. దీంతో క్రీ.శ.1181లో పల్నాటి యుద్ధం అనివార్యమైంది.

ఐదు రోజులు ఇలా..

తొలిరోజు రాచగావు
పల్నాటి యుద్ధం ప్రారంభం రోజున మేకపోతులను బలిస్తారు. దీన్నే రాచగావుగా పిలుస్తారు. ఈ క్రతువును వీర్లదేవాలయ ప్రాంగణంలోని కథా మండపంలో ఆచారవంతులు (వీరుల వంశీకులు) చేస్తారు.

రెండోరోజు రాయభారం
మలిదేవ, బ్రహ్మన్నల పరివారం అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించుకుని మాచర్ల రాజ్యాన్ని తిరిగి ఇవ్వాలంటూ గురజాల రాజు నలగాముడి వద్దకు అలరాజును రాయభారం పంపిస్తారు. రాయభారి దారి మధ్యలో హత్యకు గురవడంతో పల్నాటి యుద్ధం అనివార్యమవుతుంది. దీన్ని కళ్లకు కట్టినట్లుగా కథా మండపంలో వీరవిద్యావంతులు గానం చేస్తుండగా ఆచారవంతులు కత్తి సేవ చేస్తారు.

మూడోరోజు మందపోరు
మలిదేవ, బ్రహ్మన్న పరివారం అరణ్యవాస సమయంలో నల్లమల అటవీ ప్రాంతమైన మండాది పరిసరాల్లో వారికి అన్నపానీయాలను అందించే ఆవులను మేపుతుంటారు. వాటిని వధించేందుకు నాగమ్మ ప్రోద్బలంతో అడవి చెంచులు రావటం, వారిని అడ్డుకునేందుకు లంకన్న భీకరయుద్ధం చేసి మృత్యువాత పడతాడు. విషయం తెలిసి బ్రహ్మన్న పరివారంతో ఆ ప్రాంతానికి రాగా చెంచులు పారిపోతారు. ఈక్రమంలో లంకన్నకు శంఖుతీర్థమిచ్చి బ్రహ్మన్న ముక్తి ప్రసాదిస్తాడు. అనంతరం కులమతాల రక్కసిని రూపుమాపి అందరికీ సహపంక్తి భోజనాలు నిర్వహించిన తీరును ప్రత్యక్షంగా చూపిస్తారు.

నాలుగో రోజు కోడిపోరు
పల్నాటి యుద్ధంలో ప్రధాన ఘట్టం కోడిపోరు. క్రీ.శ.1173లో రెంటచింతల మండలం పాల్వాయిలోని పాడేరు గుట్టలపై మాచర్ల, గురజాల రాజ్య ప్రతినిధులు ప్రతిష్ఠాత్మకంగా కోడి పోరు నిర్వహించారు. బ్రహ్మనాయుడి సారథ్యంలో మాచర్ల రాజులు చిట్టిమల్లు అనే కోడితో పోరుకు రాగా.. నాగమ్మ నేతృత్వంలో గురజాల రాజు సివంగిడేగతో పోరుకు సిద్ధమవుతారు. మూడు దఫాలుగా జరిగిన పోరులో నాగమ్మ కుయుక్తితో సివంగిడేగ గెలుస్తుంది. ఈ తతంగాన్ని వీర్లదేవాలయ ప్రాంగణంలోని కోడిపోరు గరిడీలో నిర్వహిస్తారు.

అయిదో రోజు కల్లిపాడు
క్రీ.శ.1181లో జరిగిన పల్నాటి యుద్ధంలో 66 మంది వీరనాయకులతోపాటు వందలాది మంది సైనికులు మృత్యువాత పడ్డారు. వీరనాయకులు మృతి చెందిన తీరును చూపడమే కల్లిపాడు ఉద్దేశం. ఆచారవంతులు వీరుల ఆయుధాల (కొణతాలు)తో పీఠాధిపతి ద్వారా శంఖుతీర్థం తీసుకుని యుద్ధక్షేత్రానికి వెళతారు. అక్కడి పోతురాజు శిల వద్ద ఉంచిన తంగెడ మండలపై వాలిపోయి యుద్ధంలో మృతి చెందినట్లుగా చూపుతారు. దీంతో ఆరాధనోత్సవాలు ముగుస్తాయి.

అసువులు బాసిన వారిని స్మరిస్తూ వేడుక
పల్నాటి యుద్ధంలో అసువులు బాసిన 66 మంది వీరనాయకులను స్మరిస్తూ ఏటా పల్నాడు జిల్లా కారంపూడిలోని వీరుల దేవాలయం పరిసరాల్లో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. కార్తిక అమావాస్య నుంచి ఐదురోజులపాటు (నవంబరు 30 నుంచి డిసెంబరు 4వరకు) పల్నాటి యుద్ధానికి దారి తీసిన ప్రధాన క్రతువుల పేరున వేడుక జరుపుతారు.