ఎస్సీ రిజర్వేషన్ కోసం క్రైస్తవ మహిళ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం, ‘రాజ్యాంగాన్ని మోసం చేయడమే’ అని వ్యాఖ్య
బాప్టిజం తీసుకున్న క్రైస్తవురాలైన ఒక మహిళ హిందువునని చెప్పుకుంటూ తనకు ఉద్యోగంలో ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తింపజేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ అప్పీలును సుప్రీంకోర్టు ఇవాళ తిరస్కరించింది. అటువంటి పని ‘రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది’ అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ఆ మహిళ అప్పీలును డిస్మిస్ చేసింది. నిజమైన ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తిస్తాయని, మతం మారితే ఆ ప్రయోజనాలకు వర్తించవనీ స్పష్టం చేసింది. మతం మారి కూడా రిజర్వేషన్ లబ్ధి పొందడానికి ప్రయత్నించడం రాజ్యాంగపు మౌలిక లక్ష్యాల్లో ఒకటైన సామాజిక న్యాయానికి విఘాతం కలిగిస్తుందని ఘాటుగా స్పందించింది.
తమిళనాడుకు చెందిన సి సెల్వరాణి పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఒక ప్రభుత్వ కార్యాలయంలో యుడిసిగా పనిచేస్తోంది. తను తమిళనాడులో షెడ్యూల్డు కులాలలో ఒకటైన వల్లువన్ కులానికి చెందినదానినని, అందువల్ల తనకు ఎస్‌సి రిజర్వేషన్ ప్రయోజనాలు కలిగించాలనీ ఆమె కోరింది. అయితే రాష్ట్రప్రభుత్వ విచారణలో ఆమె క్రైస్తవ కుటుంబంలో పుట్టిన విషయం వెల్లడైంది. ఆమె తండ్రి హిందూమతం నుంచి క్రైస్తవంలోకి మతం మారాడు. సెల్వరాణి 1991లో పుట్టిన కొన్నాళ్ళకే ఆమెకు బాప్టిజం కూడా ఇచ్చారు.
సెల్వరాణి తండ్రికి, సోదరుడికీ ఎస్సీ సర్టిఫికెట్లు ఉన్నాయి. సెల్వరాణి కూడా తను వల్లువన్ అనే ఎస్సీ కులానికి చెందిన దాన్నని చెప్పుకుంది. తద్వారా ప్రభుత్వోద్యోగాల్లో ఎస్సీ కులాలకు ఇచ్చే లబ్ధిని పొందాలి అనుకుంది. అయితే వెరిఫికేషన్ ప్రక్రియలో ఆమె పుట్టినప్పటినుంచే బాప్తిజం పొందిన క్రైస్తవురాలు అన్న విషయం బైటపడింది. సెల్వరాణి పెళ్ళి కూడా క్రైస్తవ వివాహ చట్టం ప్రకారం రిజిస్టర్ అయింది. ఎస్సీ రిజర్వేషన్ లబ్ధి కావాలనుకున్న సెల్వరాణి, తను మళ్ళీ హిందూమతంలోకి మారిపోయానని చెప్పుకుంది. అయితే దాన్ని ధ్రువీకరించే ఆధారాలేమీ లేవు. దాంతో తమిళనాడు ప్రభుత్వం ఆమెకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది.
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సెల్వరాణి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆమెకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని నిర్ధారించింది. హిందూమతం విడిచి క్రైస్తవం లేదా మరే ఇతర మతంలోకి అయినా మారితే హిందూమతంలోని కులం పోతుందని, ఆ కులం ఆధారంగా వచ్చే రిజర్వేషన్ దక్కదనీ స్పష్టం చేసింది. ఎస్సీ రిజర్వేషన్ కావాలంటే మళ్ళీ హిందూమతంలోకి మారాలనీ, ఆ మేరకు స్పష్టమైన ఆధారాలు ఉండాలనీ కూడా చెప్పింది.
మద్రాస్ హైకోర్టు తీర్పుతో నిరాశ చెందిన సెల్వరాణి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానిమీదనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సెల్వరాణి అప్పీలును డిస్మిస్ చేస్తూ సమగ్రమైన, సవివరమైన తీర్పు ప్రకటించింది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం చాలా స్పష్టంగా తమ తీర్పును ప్రకటించింది. ‘‘దరఖాస్తుదారురాలు క్రైస్తవురాలు అయినప్పటికీ కేవలం ఉద్యోగంలో రిజర్వేషన్ కోసమే హిందువుగా ఉన్నట్లు చెప్పుకుంటోంది. అటువంటి వ్యక్తికి ఎస్సీ హోదా ఇవ్వడం రిజర్వేషన్ల మౌలిక స్ఫూర్తికే విరుద్ధం, అలాంటి చర్య రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది’’ అని స్పష్టం చేసింది.