
దేశ, విదేశాల నుంచి వచ్చిన మహిళలు భారతీయ సంస్కృతిపై ఇష్టం పెంచుకున్నారు. చీర, పంచెకట్టులో దర్శనిమిచ్చారు. వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడి విధానాలను పరిచయం చేయడమే కాకుండా.. స్థానిక అలవాట్లను వంటబట్టించుకున్నారు. సత్యసాయిబాబా నడయాడిన పుట్టపర్తికి పలు దేశాల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు. తెలుగోడి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి సత్యసాయి తీసుకెళ్లారని చెబుతున్నారు.
అంతేకాకుండా శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు మరువలేనివని కొనియాడుతున్నారు. ఓసారి పుట్టపర్తికి వస్తే.. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోందని చెబుతున్నారు. ఎన్ని సమస్యలతో వచ్చినా.. మందిరంలో అడుగు పెట్టాక ప్రశాంతత వస్తుందని పేర్కొంటున్నారు.
ప్రశాంతతకు మారుపేరు
పుట్టపర్తికి చాలా ఏళ్ల నుంచి వస్తున్నా. వచ్చిన ప్రతిసారీ నెల రోజులు ఉంటా. ఫుడ్ బాగా నచ్చింది. తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. చీరకట్టు చాలా నచ్చింది. సత్యసాయి కోట్ల మంది గుండెల్లో కొలువై ఉన్నారు. – మెరియిల్లె, ఫ్రాన్స్
మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది
పుట్టపర్తి గురించి చాలా ఏళ్లుగా వింటున్నా. తొలిసారి 15 రోజుల క్రితం వచ్చా. ఇక్కడే ఉండాలనిపిస్తోంది. ఒక వ్యక్తి ఇంతమందికి ఓ శక్తిలా మారి.. ఒక ఊరిని తయారు చేశారంటే మామూలు విషయం కాదు.– ఒట్టావి, ఫ్రాన్స్
సంప్రదాయాలు బాగున్నాయి
తెలుగు సంప్రదాయం నచ్చిoది. చీరకట్టుకోవడం, తెలుగు వంటకాలు నేర్చుకున్నా. సెంట్రల్ ట్రస్టు సేవలు చాలా బాగున్నాయి. విద్య, వైద్యంపై భగవాన్ శ్రీసత్యసాయి సేవలను చరిత్ర మరువదు.– డానేలా, ఇటలీ





