
చరిత్ర పరిశోధకులు తనికెళ్ల శ్రీనివాసప్రసాద్, సంఘ సేవకులు జీవీ.రత్నంతో కలిసి ప్రకాశం జిల్లా దర్శిలోని అచ్చెన్న చెరువు వద్ద అరుదైన 13వ శతాబ్దంనాటి ‘నాగవంశ’ శాసనాన్ని వెలికితీశారు. అచ్చెన్న చెరువు కట్టపై సమాధుల మధ్య ముళ్లకంపలో ఈ శాసనాన్ని గుర్తించి దర్శి నగర పంచాయతీ అధికారుల చొరవతో వెలికితీసినట్లు శ్రీనివాసప్రసాద్ తెలిపారు. క్రీశ 1317లో ఈ శాసనాన్ని ఆనాటి దర్శి పాలకుడైన నాగవంశరాజు మహా మండలేశ్వర అస్నదేవమహారాజు వేయించారు. వీరు నాగవంశానికి చెందినవారు.
ఈ శాసనంలో నాగవంశ రాజుల ఏడు తరాల వంశవృక్షం రాసి ఉంది. అప్పట్లో దర్శిలో వేణుగోపాలస్వామి ఆలయం నిర్మించినట్లు అందులో పేర్కొన్నారు. స్వామివారికి పొతకమూరు, దర్శి, దేవవరం, పెదపాంతడ, చినపాంతడ, సామంతపూడి, పూరిమెట్ల, ఈదర గ్రామాల్లో మాన్యాలు ఇచ్చారు. ఈ నాగవంశం వారు త్రిపురాంతకం, రంగవరంలో 1392లో శాసనాలు వేయించారు. వీరి చిహ్నం సర్పం. వీటితో పాటు దర్శిలో ఆంజనేయస్వామి, శివాలయంలో కాకతీయ శాసనాలున్నాయని శ్రీనివాసప్రసాద్ తెలిపారు. శాసనం వెలికితీయటంలో అబుసలేం సహకరించారు.





