News

వేద పురాణ శాస్త్రాలన్నీ సన్మార్గ దర్శనానికే

340views

వేద పురాణ శాస్త్రాలన్నీ మనిషికి సన్మార్గ దర్శనం చేయిస్తాయని శ్రీశృంగేరీ శారదా పీఠం జగద్గురు విధుశేఖర భారతీ స్వామి అన్నారు. శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన గురువందనం, పౌరసన్మానం సందర్భంగా ఆయన భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. స్వామి మాట్లాడుతూ ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన భజగోవిందం వేద సారాన్ని వివరిస్తోందన్నారు. ‘గేయం గీతా నామ సహస్రం’ అనే శ్లోకంలో మనిషి భగవదారాధనను, పరోపకారాన్ని నిత్యం చేస్తూ జీవించాలని వివరంగా చెప్పారన్నారు. అలాగే భర్తృహరి నీతి శతకంలోనూ ఎన్నో మార్గదర్శకాలున్నాయని వివరించారు. రామాయణం పూర్తిగా అవగాహన చేసుకుంటేనే రావణ, సీతల విషయంలో రాముడు చేసిన ధర్మాలు అర్థమవుతాయన్నారు. ఆంధ్ర దేశంలో విజయ యాత్ర చేయడానికి ప్రధానమైన సంకల్పం గుంటూరులోని వేద ప్రవర్ధక విద్వత్‌ పరీక్షా సభ శత వసంత ఉత్సవ కార్యక్రమాలన్నారు. ఈసందర్భంగా తొలుత పోలిశెట్టి శ్రీహరిప్రసాదరావు, శ్యామసుందర్, గబ్బిట శివరామకృష్ణ ప్రసాద్‌ తదితరులు స్వామికి జయపత్ర, ఫల, జ్ఞాపికలను సమర్పించారు. ఇదే వేదికపై గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని స్వామి పక్షాన నిర్వాహకులు సత్కరించారు. అంతకుముందు సంపత్‌నగర్‌ శారతా పీఠంలో జరిగిన చతుర్వేద హవనాల్లో స్వామి పాల్గొన్నారు.