
తెలుగును మరిస్తే అమ్మను మరిచిపోయినట్లేనని తెలుగు భాష పరిరక్షణ సమితి కార్యదర్శి ఎస్. తమ్మిరాజు తెలిపారు.విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో తెలుగుకు వెలుగునిద్దాం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు తెలుగు భాష గొప్పతనంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహనరావు, తమ్మిరాజు మాట్లాడుతూ ఉద్యోగం పొందడానికి ఇతర భాషలు అవసరమైతే మంచి జీవితానికి తెలుగు అవసరమన్నారు. గొప్ప వ్యక్తుల జీవితాలు తెలుసుకోవడానికి రోజుకి కనీసం అరగంట తెలుగు పుస్తకాలు, కథలను విద్యార్థులు చదవాలన్నారు. అమ్మను మమ్మీ అని పిలుస్తూ బతికున్న మనిషిని శవాన్ని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు తెలుగు గొప్పతనాన్ని తెలియజేస్తే వారు తమ తరువాత సమాజానికి వారసత్వ సంపదగా అందిస్తారనే ఆశలతో వయసు మీదపడినా ఇప్పటివరకు వంద సభలు నిర్వహించామన్నారు. విద్యార్థుల్లో తెలుగుపట్ల అవగాహన, అభిరుచిని పెంచడానికి త్వరలో మహాభారతంపై పోటీలను నిర్వహిస్తామన్నారు. తెలుగును ముందు వరుసలో ఉంచడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, భాషాభిమానులు కృషి చేయాలని కోరారు. పాఠశాల వ్యవస్థాపకులు సంతోష్‌కుమార్, మాధవి, మల్లేశ్వరి, అప్పలరాజు, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.




