
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సు కుర్రం జిల్లాలో గురువారం ప్రయాణికులతో వెళుతున్న పలు వాహనాలపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. తాలిబన్ల ప్రభావం ఉన్న అఫ్గానిస్థాన్ సరిహద్దులో జరిగిన ఈ మెరుపుదాడిలో 50 మంది మృతిచెందగా, మరో 20 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో చాలామంది షియా ముస్లిం వర్గీయులు. మృతుల్లో 8 మంది మహిళలు, అయిదుగురు చిన్నారులు ఉన్నారు. ప్రయాణికులు పరాచినార్ నుంచి పెషావర్ వెళుతుండగా మార్గమధ్యంలో ఉగ్రవాదులు అటకాయించి కాల్పులకు తెగబడ్డారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఆ సమయంలో దాదాపు 200 వాహనాలు ఆ మార్గంలో వెళుతున్నాయి. ఈ ప్రాంతంలో మెజారిటీ వర్గీయులైన సున్నీ ముస్లింలు, మైనారిటీలైన షియాల మధ్య గత కొన్ని నెలలుగా జరిగిన మతపరమైన ఘర్షణల్లో డజన్లకొద్దీ జనం మృత్యువాత పడ్డారు. ఈ ఘర్షణల కారణంగా గత కొన్ని వారాలుగా మూసి ఉంచిన హైవేను వారం రోజుల కిందటే తెరిచినట్లు అధికారులు తెలిపారు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం దారుణమని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్‌అలి జర్దారీ, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండించారు.




