
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఒకరోజు అఖిల భారతీయ కార్యకారిణి సమావేశం గోరఖ్ పూర్ వేదికగా జరిగింది. దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్ పూర్ యూనివర్శిటీలోని సంవాద భవన్ లో ఈ సమావేశం జరిగింది. దీనికి ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ రాజశరణ్ షాహి, ప్రధాన కార్యదర్శి యాజ్ఞవల్క్య శుక్లా, జాతీయ కార్యదర్శి అశ్వీష్, అఖిల భారతీయ సదస్యులు హాజరయ్యారు. సరస్వతీ మాత, వివేకానంద చిత్రపటాలకు పూలమాలలతో నివాళులు అర్పించి, వందేమాతర గీతాలాపనతో ప్రారంభమైంది.
ఇక… పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని మధ్యప్రదేశ్ ఏబీవీపీ శాఖ ‘‘మాన్వందన యాత్ర’’ నిర్వహిస్తోంది. ఈ యాత్ర ముగింపు చేసుకొని, ఈ జాతీయ కార్యవర్గ సమావేశానికి చేరుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల గుండా ఈ యాత్ర సాగింది. భారత దేశ సాంస్కృతిక విశిష్టతను పునరుద్ధరించడంలో అహల్యాబాయి పాత్రను వివరించడమే ఈ యాత్ర లక్ష్యమని ఏబీవీపీ పేర్కొంది.
మరోవైపు ఈ జాతీయ కార్యవర్గ సమావేశంలో విద్యాఅంశాలు, సామాజిక సమస్యలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిగాయి. 70వ ఏబీవీపీ జాతీయ సదస్సులో ప్రవేశపెట్టనున్న ఐదు కీలక తీర్మానాలపై కూడా లోతుగా చర్చించారు. విద్యా సంస్థల్లో విద్య నాణ్యతను పెంచడం, ఫీజుల పెంపు సమస్యను పరిష్కరించడం, కల్తీ ఆహార ఉత్పత్తులను నియంత్రించడం, మణిపూర్ హింసాకాండ పై కూడా చర్చించారు. ఈ నెల 22 నుంచి 24 వరకూ జరిగే ఏబీవీపీ జాతీయ సదస్సులో ఈ ఐదు తీర్మానాలను ఆమోదిస్తారు.
గోరఖ్ పూర్ శౌర్య భూమి అని, అనేక మంది ధైర్యవంతులు ఇక్కడ జన్మించారని ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు తెలిపారు. స్వాతంత్రోద్యమంలో ఈ నగరం గణనీయమైన కృషి చేసిందని, రాజకీయ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాల్లో అపారమైన ప్రాముఖ్యతను కలిగి వుందని వివరించారు. సానుకూల వాతావరణంలో సృష్టించడానికి ఏబీవీపీ కార్యకర్తలు దేశవ్యప్తంగా పనిచేస్తున్నారని, దీంతో విద్యారంగంలో కొంత మార్పు కనిపిస్తోందని తెలిపారు.





