News

JNU లో రెండు రోజుల పాటు జనజాతీయ గౌరవ దివస్ పై సెమినార్

228views

ఢిల్లీలోని JNU లో జనజాతీయ గౌరవ దివస్ పై జాతీయ సెమినార్ జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో దేశీయ విజ్ఞానం, గిరిజన సంప్రదాయాలు మరియు సాంస్కృతిక పద్ధతులపై ఇందులో చర్చించారు. దేశమంతటా సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలు, చారిత్రక సంఘటనలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సెమినార్ కి ఆదివాసీ మేధావులు, విద్యార్థులు హాజరయ్యారు. గిరిజన వర్గాల సంస్కృతిని రక్షించడం, ప్రోత్సహించడం, వనవాసీ ప్రాముఖ్యతపై లోతైన చర్చలు జరిగాయి. ఈ ఆధునిక జీవితంలో వనవాసీల సంస్కృతి, ఔచిత్యాన్ని వక్తలు నొక్కి చెప్పారు.

ఈ రెండు రోజుల సెమినార్ ను సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ హీరామన్ తివారీ ప్రారంభించారు. గిరిజన సంస్కృతులను సమగ్రపరచడం, వాటి ప్రాముఖ్యతపై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనవాసీ నాయకుడు, భారతీయ వనవాసీ కల్యాణ్ ఆశ్రమం ఉపాధ్యక్షుడు టెక్కీ గుబిన్ కూడా హాజరయ్యారు.టెక్కీ గుబిన్ తన ప్రసంగంలో ప్రకృతి ఆరాధనను నొక్కి చెప్పారు. ఇది కేవలం ఓ మతానికి సంబంధించినది కాదని, అదో పర్యావరణ తత్వశాస్త్రమని తెలిపారు. గిరిజనులకు ప్రతి నదీ, పర్వతం, చెట్టు, జంతువుల అన్నింటిలోనూ దైవత్వాన్ని చూస్తారన్నారు. వీరు అడవులను కేవలం పర్యావరణంలో భాగంగా చూడరని, జీవనానికి మూలంగా చూస్తారని తెలిపారు. ప్రకృతి ఆరాధన ద్వారా వనవాసీలు సంపూర్ణ ప్రపంచ దృష్టికోణాన్ని చూపిస్తుందని, సమాజ శ్రేయస్సును కాంక్షిస్తారని తెలుస్తోందని తెలిపారు.

NCST మాజీ చైర్మన్ హర్ష చౌహాన్ దేశీయ విజ్ఞానం మరియు దాని సవాళ్లు” అనే అంశంపై ప్రసంగించారు. సమకాలీన సమాజంలో పరిశోధనపై మాట్లాడారు. వనవాసీల గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వనవాసీల సంప్రదాయాలను సమగ్ర పద్ధతిలో డాక్యుమెంట్ చేయడం చాలా కీలకమని అన్నారు.
మరోవైపు మంత్రి దుర్గాదాస్ ఉకేజీ మాట్లాడుతూ.. వనవాసీల హక్కులపై మాట్లాడారు. దేశీయ విజ్ఞానం మరియు సంప్రదాయాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై వుందన్నారు.తరతరాలుగా గిరిజన సంఘాలు తమ హక్కులు మరియు గౌరవం కోసం పోరాడేలా ప్రేరేపించడంలో బిర్సా ముండా నాయకత్వం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.