
ఇస్లాం ఆధారంగా పరమత ద్వేషం రగిలిస్తూ, యువతను రెచ్చగొడుతున్న వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్ మీద భారతదేశంలో ఎన్నో కేసులు ఉన్నాయి. అతడు ఇతర దేశాలకి పారిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలనే పాకిస్తాన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి బోధనలు వినిపించాడు. ఇప్పుడు పాకిస్తాన్ క్రైస్తవులు అతడి మీద ఆ దేశ అధ్యక్షుడికి, ప్రధానికి ఫిర్యాదు చేశారు. దేశ పర్యటనలో ఉండగా క్రైస్తవుల మనోభావాలను గాయపరిచే విధంగా జకీర్ మాట్లాడాడు కాబట్టి చర్య తీసుకోవలసిందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి, ప్రధాని షెహబాజ్ షరీఫ్లకు క్రైస్తవులు ఫిర్యాదు చేశారు.
పాకిస్తాన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకే అతడు ఆ దేశం వెళ్లాడు. దాదాపు నెల రోజులు ఉన్నాడు. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్లో అతడి ఉపన్యాసాలు ఏర్పాటయ్యాయి. ఆ సమావేశాలలోనే అతడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అందులో పెద్ద వింతేమీ లేదు. క్రైస్తవానికి వ్యతిరేకంగా జకీర్ అంత తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికి పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం దారుణమని సైనాడ్ బిషప్ అధ్యక్షుడు, పాకిస్తాన్ చర్చి అధ్యక్షుడు రెవరెండ్ అజాద్ మార్షల్లా అధ్యక్షుడికి, ప్రధానికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రభుత్వ అతిథిగా వచ్చిన వ్యక్తి మరొక మతం మీద చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం దారుణమని ఆయన ఆరోపించారు. క్రైస్తవుల విశ్వాసాలను జకీర్ బాహాటంగా సవాలు చేస్తూ విమర్శలకు దిగాడని బిషప్ పేర్కొన్నారు.





