
కార్తిక పౌర్ణమి శుక్రవారం పోతురాజుకు ‘పడిగెం’ కట్టే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ తెలిపారు. రాత్రి జ్వాలా తోరణం గుండా బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహకుంతం, పల్నాటి వీరుల ఆయుధాలు (దైవాలు) వీర్ల అంకాలమ్మ తల్లిని దర్శించుకుని అనంతరం వీరుల గుడికి తరలివెళ్లి వీరుల గుడి ముఖమండపంలో ఉన్న పోతురాజు శిలకు 101 నూలు పోగులతో పడిగెం కట్టే కార్యక్రమం జరిగిందని తెలిపారు.
ముందుగా చెన్నకేశవుని సన్నిధిలో ఉన్న నృసింహకుంతాన్ని వెలుపలికి తీసి నాగులేరు గంగధారిలో స్నానాధికాలు చేయించి అలంకారం చేసి పూజ కట్టుకోవడం జరిగిందన్నారు. అనంతరం చెన్నకేశవస్వామిని దర్శించుకుని పూజలు చేసి, రాత్రికి వీర్ల అంకాలమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉన్న నగరేశ్వరస్వామి ఆలయ ముఖద్వారానికి ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం గుండా పల్నాటి వీరుల ఆయుధాలు (దైవాలు) దర్శించుకున్న అనంతరం పీఠాధిపతితో వీరుల గుడి పూజారులు వీరుల గుడికి ఊరేగింపుగా చేరుకుని అక్కడ పోతురాజుకు పడిగెం కట్టారు. బ్రహ్మానాయుడు నృసింహకుంతం పోతురాజుకు ఎదురుగా ఉంచి పీఠాధిపతి పర్యవేక్షణలో పూజారులు పోతురాజు శిలకు పడిగెం కట్టే క్రతువు నిర్వహించారు.
ఉత్సవాలు పూర్తయ్యేవరకు ప్రాంగణం వీడి వెళ్లవద్దని బ్రహ్మనాయుడు పోతురాజుకు ఆన పెట్టినట్లుగా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం వీరుల గుడిలో అలంకరించిన ఆయుధాలు కొన్ని ఉంచి చెన్నకేశవ పీఠాన్ని గుడిలో ఉంచి ఎదురుగా జ్యోతి వెలిగించారు. ఇలా పల్నాటి వీరారాధన ఉత్సవాల ఏర్పాట్లకు శ్రీకారం చుట్టి ఈ నెల 30 కార్తిక అమావాస్య నుంచి ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాలకు తరలిరావాల్సిందిగా పల్నాటి వీరాచారులకు వర్తమానాలు పంపుతామని చెప్పారు.





