
తరుచూ హిందువులపై దాడి జరగడం, హిందువులను అష్టకష్టాలూ పెట్టడం, దుర్గాదేవి మండపాల దగ్గర జిజీయా పన్నులు వసూళ్లు…. మానవ హక్కుల ఉల్లంఘన బంగ్లాదేశ్ లో నిత్యకృత్యమైంది. మరీ ముఖ్యంగా ప్రధాని పీఠం నుంచి షేక్ హసీనా దిగిపోయిన తర్వాత ఇస్లాం ఛాందసులు మరింత రెచ్చిపోయారు. ప్రపంచ దేశాలు హిందువుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. అయినా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కదిలితే ఒట్టు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో కీలక పరిణామం జరిగింది.
బంగ్లాదేశ్ లో హిందువులను చంపేయడంలో ప్రమేయం వుందని అక్కడి తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనుస్ సహా వారి కేబినెట్ మంత్రులు, వారి పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాల నేతలపై అవామీ లీగ్ పార్టీ కేసులు నమోదు చేసింది. హిందువులను చంపేయడంలో వీరి పాత్ర కీలకంగా వుందని ఆరోపిస్తూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనుస్ సహా 61 మందిపై కేసులు పెట్టడంతో సంచలనం రేగింది.
ప్రధాని యూనుస్, వారి కేబినెట్ మంత్రులు, అలాగే ఆ పార్టీకి అనుబంధంగా వుండే విద్యార్థి సంఘ నాయకులతో 61 మందిపై హేగ్ లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకి అధికారికంగా ఫిర్యాదు చేశామని అవామీ లీగ్ ప్రకటించింది. మానవత్వాన్ని తుంగలో తొక్కి, నేరాలకు పాల్పడ్డారని, అందుకే ఆర్టికల్ 15 కింద తాత్కాలిక ప్రధాని యూనుస్ సహా ఇతరులు తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని సిల్హెట్ నగర మాజీ మేయర్ అన్వరుజ్జమాన్ చౌదరి తెలిపారు.
బంగ్లాదేశ్ లో విద్యార్థి ఉద్యమం, ప్రభుత్వంపై తిరుగుబాటు అన్న ముసుగులో ఆగస్టు 5 నుంచి ఎనిమిదో తేదీ వరకూ బంగ్లాదేశ్ అవామీ లీగ్ తో పాటు దాని అనుబంధ సంఘాల కార్యకర్తలపై, అలాగే హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులతో పాటు పోలీసు బలగాలు కూడా క్రూరమైన మారణ హోమానికి గురయ్యారని, వారిని తీవ్రంగా అణచివేశారని అన్వరుజ్జమాన్ చౌదరి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అన్ని సాక్ష్యాలను తాము కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.తమ ఫిర్యాదు 800 పేజీలతో వుందని, మరో 15 వేల ఫిర్యాదులను కూడా దానికి జోడించామని మాజీ మేయర్ అన్వరుజ్జమాన్ ప్రకటించారు.





