
మండల-మకరవిళక్కు 2024-25 సందర్భంగా శబరిమల వెళ్లే భక్తులు.. దర్శనం కోసం ముందుగానే ఆన్‌లైన్ టైమ్ స్లాట్ ద్వారా తేదీని, సమయాన్ని ఎంపిక చేసుకోవాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కోరినట్లు.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ తెలిపారు. టైమ్‌స్లాట్ దర్శనం, అక్కడ పాటించాల్సిన మార్గదర్శకాలను ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు.. అన్ని రాష్ట్రాలకు తెలిపింది. భక్తులు పాటించాల్సిన నిబంధనలను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. నిత్యం సన్నిధానానికి చేరుకునే భక్తుల సంఖ్య 70-80 వేల వరకు ఉంటుందని, ప్రవేశ ద్వారం నుంచి 10 వేల మందే సన్నిధానం చేరే వీలుందని తెలిపారు. అందుకే ముందుగానే ఆన్‌లైన్ టైమ్‌స్లాట్ బుక్ చేసుకోవాలని కోరారు. భక్తులు తమ వెంట ఆధార్‌కార్డు తీసుకురావాలని, విదేశీ భక్తులైతే పాస్‌పోర్టు కాపీని తీసుకురావాలని ట్రావెన్‌కోర్ బోర్డు కోరిందని చెప్పారు.





