
ఇతర మతాల నుంచి హైందవ సమాజం ఎదుర్కొంటున్న ఇబ్బందులను నిరసిస్తూ ఒడిశాలో హిందూ సంస్థలు, ధార్మిక సంస్థలు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఒడిశాలోని భద్రక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ నిరసన కార్యక్రమం జరిగింది.ఈ నిరసనలో వేలాది మంది హిందువులు పాల్గొని, తమ నిరసనను వ్యక్తం చేశారు. హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా లవ్ జిహాద్, అక్రమ వలసదారుల ఆగడాలు, ఈ అక్రమ బంగ్లాదేశీయులకు ఆశ్రయం కల్పిస్తున్న వారిని శిక్షించాలని, ఈ కుట్రల నుంచి హిందూ సమాజాన్ని రక్షించాలని వారు డిమాండ్లు పెట్టారు. రాష్ట్రంలోని మతసామరస్యాన్ని దెబ్బతీయాలని కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయంటూ కొన్ని నెలలుగా ఒడిశాలో హిందువులు ఆందోళనలు చేస్తూనే వున్నారు. ఎక్కడికక్కడ నిరసనలు, ఫిర్యాదులు చేసినా… పరిష్కారం మాత్రం శూన్యం. దీంతో భారీ స్థాయిలో హిందువులు ఆందోళన చేపట్టారు.
కొన్ని రోజులుగా భద్రక్ జిల్లాలో ఇస్లామిక్ ఛాందసుల ఆగడాలు మితిమీరుతున్నాయని, శాంతికి భంగం కలిగిస్తున్నాయని హిందూ సంఘాలు ఆరోపించాయి. ఛాందసులు కొన్ని సమయాల్లో పోలీసులపై కూడా దాడులు చేస్తున్నాయని, హిందూ వ్యాపారులను, హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయని పేర్కొన్నారు. గోహత్యలు, పశువుల అక్రమ రవాణా విచ్చల విడిా సాగుతున్నాయి. అవసరమైన చర్యలు తీసుకోవాలని పదే పదే హిందూ సంఘాలు డిమాండ్ చేసినా.. భద్రక్ జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా యంత్రాంగం తీరు ఇలా వుండటంతోనే తాము రోడ్లపైకి వచ్చి తేల్చుకోవాలని అనుకున్నామని హిందూ సంఘాలు స్పష్టం చేశాయి. సంఘ వ్యతిరేక శక్తులు, సంఘ వ్యతిరేక శక్తులపై వెంటనే చర్యలు చేపట్టాలని, లేదంటే రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళనలు, నిరసనలు చేపడతామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది.
ఈ సందర్భంగా హిందూ సంఘాలు జిల్లా యంత్రాంగం ముందు పెట్టిన డిమాండ్లివీ….
1. త్వరితగతిన అరెస్టులు, దర్యాప్తులు : ఇటీవల పోలీసులు, ఇతరులు హిందువులపై దాడి చేశారని, ఆ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, దర్యాప్తును వేగిరం చేయాలన్నది డిమాండ్.
2. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు : లవ్ జిహాద్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయని, మత మార్పిళ్లపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నది డిమాండ్.
3. అక్రమంగా వుండే విదేశీ పౌరులను గుర్తించాలని, గుర్తించిన తర్వాత వెంటనే వారిని బహిష్కరించాలన్నది మరో డిమాండ్. వారికి ఆశ్రయం కల్పించే భూస్వాములపై చర్యలు తీసుకోవాలి.
4. హిందూ వారసత్వ ప్రదేశాలు, సంస్థలను పరిరక్షించాలి. 1960 ఒడిశా గోహత్య నిషేధ చట్టం, అక్రమ గోహత్య మరియు అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి. భద్రక్ చారిత్రాత్మక సదావర్తి మఠానికి చెందిన భూములను మతాచార్యులకు అప్పగించాలి.
5.హమాస్ మరియు తెహ్రిక్-ఇ-తాలిబాన్ వంటి అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులపై ఎన్ఐఏ విచారణ జరిపించాలి.
వీటితో పాటు క్రైస్తవ మిషనరీలు బలవంతంగా మత మార్పిళ్లుచేస్తున్నారని, మత మార్పిళ్లను వెంటనే నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని, మతం మారిన వారికి వచ్చే ప్రభుత్వ ప్రయోజనాలను కూడా ఆపేయాలని డిమాండ్ చేశారు.





