
శబరిమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే అయ్యప్ప భక్తులు వారి యాత్రను సురక్షితంగా నిర్వహించుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని శబరిమల సంరక్షణ సంగమం డిమాండ్ చేసింది.తీర్థయాత్ర సజావుగా సాగే దిశగా పర్యవేక్షణ మరియు ప్రాథమిక సౌకర్యాల కల్పనతో పాటు కేంద్ర అధికార యంత్రాంగం పర్యవేక్షణ అవసరమని స్పష్టం చేసింది. శబరిమల కర్మ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శబరిమల సంరక్షణ సంగమం సమావేశానికి వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు హామీలు నెరవేరని కారణంగా యాత్రికులు పలు ఇబ్బందులకు గురి అవుతున్నారని పందళం ప్యాలెస్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ పి.ఎన్.నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎదుట శబరిమల సంరక్షణ సంగమం పలు డిమాండ్లను ఉంచింది.
డిమాండ్లు:
త్రాగునీరు, విశ్రాంతి స్థలాలు మరియు భక్తులకు అవసరమైన ఇతర సౌకర్యాలలో తక్షణ మెరుగుదలలు.
శబరిమల ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడే దిశగా పూజా వస్తువులలో స్వచ్ఛతకు హామీ.
యాత్రికుల కోసం మెరుగైన నియంత్రణ మరియు భద్రతను నిర్ధారణకు మందిరం భద్రతను కేంద్ర బలగాలకు అప్పగించాలి.
సన్నిధానం సమీపంలోని ప్రైవేట్ రెస్టారెంట్ల మూసివేత, ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు (TDB) ఆధ్వర్యంలో ఉచిత ఆహార పంపిణీ.
ఆలయ ఆచారాలు మరియు సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం మరియు TDB చర్చల్లో పందళం ప్యాలెస్, భక్తుల సంస్థలు మరియు హిందూ సమూహాల ప్రతినిధులను చేర్చుకోవాలి.
అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని పెరియార్ టైగర్ రిజర్వ్‌లో ఆలయం ఉన్నందున, శబరిమల వద్ద అన్ని అభివృద్ధి కార్యకలాపాల కోసం కేంద్ర మరియు రాష్ట్ర శాఖల మధ్య సమన్వయాన్ని కేంద్ర ప్రభుత్వం సులభతరం చేయాలి.
ఇదిలా ఉంటే, ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు, మిజోరాం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ మాట్లాడుతూ, స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, వారికి సరైన సౌకర్యాలు లేవని ఆరోపించారు. మెరుగైన ప్రాథమిక సౌకర్యాలు, తాగునీరు, విశ్రాంతి కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే, హిందూ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్సన్ థిల్లంకేరీ మాట్లాడుతూ, హిందూ ప్రయోజనాల పట్ల, ముఖ్యంగా శబరిమల పట్ల ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. లౌకికవాదం ముసుగులో ప్రభుత్వం అయ్యప్ప భక్తులు, శబరిమల తీర్థాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. మౌలిక సదుపాయాలు, భద్రతతో పాటు వర్చువల్ క్యూ పరిమితి ఆందోళన కలిగిస్తోందన్నారు. స్పాట్ బుకింగ్‌లపై కూడా అనిశ్చిత కొనసాగడం విచారకరం అన్నారు.
దేవాలయాల నిర్వహణ ధార్మిక సంస్థలకు
హిందూ దేవాలయాల నిర్వహణను ధార్మిక సంస్థలకు అప్పగించాలని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ సినీ నిర్మాత వీజీ థంపి డిమాండ్ చేశారు. వావర్ పేరును వపురన్‌గా సరి చేయాలన్నారు. శబరిమల చుట్టూ వివాదాలు సృష్టించి సనాతన ధర్మాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతోందని శబరిమల కర్మ సమితి జనరల్ కన్వీనర్ ఎస్.జె.ఆర్. కుమార్ ఆరోపించారు.





