News

బాకు వేదికగా.. నేటి నుంచి కాప్‌-29 సదస్సు

219views

పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో అత్యంత కీలకమైన ‘కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌)’ 29వ సదస్సు అజర్‌బైజాన్‌ రాజధాని బాకు వేదికగా సోమవారం ప్రారంభం కానుంది. వాతావరణాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ నేతలు ఇందులో చర్చించనున్నారు. ప్రధాని మోదీ ఈ సదస్సుకు హాజరు కావడం లేదు. మన దేశం తరఫున 19 మంది సభ్యుల బృందం పాల్గొంటుంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్, ఆ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ ఈ బృందానికి నేతృత్వం వహించే అవకాశాలున్నాయి. సదస్సులో భారత్‌ ఈ నెల 18-19 తేదీల్లో తన అధికారిక ప్రకటన చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ చర్యల కోసం భారీగా నిధులను సమకూర్చేలా అభివృద్ధి చెందిన దేశాలను ఇందులో మన దేశం ఒత్తిడి చేసే అవకాశాలున్నాయి. కాప్‌ సదస్సులు హామీలకు పరిమితమవకూడదని కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్, వాటర్‌ (సీఈఈడబ్ల్యూ) సీఈవో అరుణభా ఘోష్‌ పేర్కొన్నారు. వాటి వాగ్దానాలు కార్యరూపం దాల్చాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. కాప్‌-29 సదస్సు ఈ నెల 22 వరకు కొనసాగుతుంది. అఫ్గానిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్లు తమ ప్రతినిధి బృందాన్ని సదస్సుకు పంపనున్నారు. అఫ్గాన్‌ పాలనా పగ్గాలను 2021లో తిరిగి చేజిక్కించుకున్న తర్వాత కాప్‌ సదస్సుకు వారు ప్రతినిధులను పంపుతుండటం ఇదే తొలిసారి.