ArticlesNews

కార్యదీక్షకు కరదీపిక శ్రీ దత్తోపంత్ ఠేంగ్డే జీ

227views

( నవంబర్‌ 10 – దత్తోపంత్ ఠేంగ్డే జయంతి )

భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ సహా పలు జాతీయవాద సంస్థలను స్థాపించి, పెంచి పెద్ద చేసిన దత్తోపంత్‌ ఠేంగ్డే జీ ఆరు దశాబ్దాల సామాజిక జీవితంలో ఆయా క్షేత్రాలలో హిమగిరి సమానులైన ఎందరో కార్యకర్తలను తయారుచేశారు. ముందు చూపు, మహోన్నత కార్యశీలత, కార్యదక్షతలతో దేశమాత సేవలో తరించిన మహనీయులు ఠేంగ్డేజీ. ఆయన పేరు వినగానే భారతీయ మజ్దూర్‌ సంఘ్‌, భారతీయ కిసాన్‌ సంఘ్‌, అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌, స్వదేశీ జాగరణ్‌ మంచ్‌, సంస్కార భారతి, సమరసత మంచ్‌, సర్వ పంత్‌ సమదార్‌ మంచ్‌ ఇలా అనేక జాతీయవాద సంస్థలు గుర్తుకొస్తాయి. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ నుంచి స్ఫూర్తి, ప్రేరణ పొందిన ఠేంగ్డేజీ, తమ జీవితాన్ని దేశమాత సేవకు అంకితం చేశారు. ఆ స్పూర్తి, ప్రేరణతో వ్యక్తి నిర్మాణం పునాదిగా అనేక జాతీయవాద సంస్థల నిర్మాణంలోనూ కీలక పాత్రను పోషించారు.

ఠేంగ్డేజీ, మహారాష్ట్రలోని వార్ధా జిల్లా ఆరవి గ్రామంలో 1920 నవంబర్‌ 10వ తేదీన జన్మించారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ హెడ్గేవార్‌ వ్యక్తిత్వ, వివేచనలకు ఆకర్షితులైన ఠేంగ్డేజీ 22 సంవత్సరాల వయసులో, 1942లో సంఘ్‌ ప్రచారక్‌గా భారత మాత సేవకు జీవితాన్ని అంకితం చేశారు. అలా మొదలైన ఠేంగ్డేజీ సామాజిక జీవనం ఆరుపదులకుపైగా దేశమాత సేవలో పునీతమైంది. ఈ ఆరుపదుల కాలంలో ఠేంగ్డేజీ, అన్య క్షేత్రాల్లోకి సంఘ్‌ భావజాలాన్ని విస్తరించారు. 1942లో సంఘ్‌ ప్రచారక్‌గా బాధ్యతలు స్వీకరించిన ఠేంగ్డేజీ, ముందు కేరళలో, ఆ తర్వాత మరో రెండేళ్లకు 1944లో బెంగాల్‌లో సంఘ్‌ కార్యాన్ని ప్రారంభించారు. ఇక అక్కడ నుంచి తుదిశ్వాస విడిచే వరకు ఆరుదశాబ్దాల పాటు సంఘ్‌ కార్యంలో చురుకైన పాత్రను పోషించారు.

ఠేంగ్డే జీ చిన్నతనం నుంచి చాలా చురుకైన, తెలివిగల విద్యార్థిగా గుర్తింపు పొందారు. స్వగ్రామం ఆరవిలో మాధ్యమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత నాగపూర్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. 1936లో మురిస్‌ కాలేజీలో ఎంఎ, న్యాయ కళాశాలలలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. కాలేజీ రోజుల్లో ఠేంగ్డేజీ, హిందుస్తాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ ఆర్మీలో క్రియాశీలక పాత్రను పోషించారు. నాగపూర్‌లో చదువుతున్న రోజుల్లోనే ఠేంగ్డేజీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌కు దగ్గరయ్యారు. సంఘ్‌ కార్యాన్ని విస్తరిస్తూనే భారత దేశచరిత్ర, తత్వశాస్త్రం, రాజకీయ, ఆర్థిక సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేశారు. అధ్యయన అంశాలు ప్రతిబింబించేలా అనేక రచనలు చేశారు. ఠేంగ్డేజీ, జీవితంలో రచన వ్యాసంగం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంత క్లిష్టమైన అంశాన్ని అయినా సామాన్యులకు సైతం చక్కగా, సులభంగా అరమయ్యే సరళమైన భాషలో చెప్పడం ఠేంగ్డేజీ రచనలు, రచనా శైలిలోని ప్రత్యేకత. ఆయన రాసిన ఇంగ్లీష్‌ పుస్తకాల్లో ‘వై భారతీయ మజ్దూర్‌ సంఘ్‌?’, ‘హిస్‌ లెగసీ ఔర్‌ మిషన్‌’, ‘నేషనలైజేషన్‌ ఆర్‌ గవర్నమెంట లైజేషన్‌’, ‘కంపూటరైజేషన్‌, మోడరనైజేషన్‌ వితౌట్‌ వెస్టర్నైజేషన్‌’ వంటి విలువైన పుస్తకాలు అనేకం ఉన్నాయి.

ఇక ఠేంగ్డేజీ ట్రేడ్‌ యూనియన్‌ జీవితంలోకి వస్తే, కార్మికనేతగా ఆయన జీవితం ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌లో ప్రారంభమైంది. 1949 నుంచి 51 వరకు పది పరిశ్రమల్లో ఐఎన్టీయూసీ అనుబంధ కార్మికసంఘాల్లో వివిధదాల్లో పనిచేశారు. ఠేంగ్డేజీ ఏ సంస్థలో పనిచేసినా ఆ సంస్థపై ఆయన చెరగని ముద్రను వేశారు. ఠేంగ్డేజీ 1955 జూలై 23వ తేదీన భారతీయ మజ్దూర్‌ సంఘ్‌’ స్థాపించారు. బీఎమ్మెస్‌తో పాటుగా ఠేంగ్డేజీ 1979 మార్చి 4వ తేదీన భారతీయ కిసాన్‌ సంఘ్‌ను, 1983 ఏప్రిల్‌ 14న సామాజిక సమరసత మంచ్‌ని, 1991 నవంబర్‌ 22న స్వదేశీ జాగరణ్‌ మంచ్‌, 1991లో పర్యావరణ మంచ్‌, 1992లో సర్వపంత్‌ సమాదర్‌ మంచ్‌’ వంటి అనేక సంస్థలను స్థాపించారు. వాటిని సర్వోన్నత శిఖరాలకు తీసుకుపోవడంలో విశేషంగా కృషి చేశారు.

దత్తోపంత్‌ ఠేంగ్డేజీ నిర్మాణ, సంస్థాగత నిర్వాహణ నైపుణ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే, ఠేంగ్డేజీ కార్యదక్షత, నిర్మాణ, నిర్వాహణ నైపుణ్యాల గురించి ఓ రచయిత, ‘ఠేంగ్డేజీ శూన్యం నుంచి ఎన్నో హిమాలయ శిఖరాలను నిర్మించారు’ అన్నారు. దత్తోపంత్ ఠేంగ్డే జీ ఎప్పుడూ, ప్రతి ఒక్కరూ సంస్థ, సిద్ధాంతాలు, లక్ష్యాలకు నిబద్ధులై పనిచేయాలే గాని వ్యక్తులకు విధేయంగా పనిచేయరాదని చెప్పేవారు. అందుకే అయన ఎప్పుడూ, పాదాభివందనాన్ని అనుమతించ లేదు. భారతమాత సేవలో నియమబద్ద జీవితాన్ని సాగించిన ఠేంగ్డేజీ, 2004 అక్టోబర్‌ 14వ తేదీన 84వ ఏట పుణెలో తుదిశ్వాస విడిచారు. ఠేంగ్డేజీ భౌతికంగా మన నుంచి దూరంగా వెళ్లిపోయినా ఆయన మానస పుత్రికలు అనదగిన సంస్థలు, ఎందరో సమర్ధ కార్యకర్తల రూపంలో సజీవంగా ఉన్నారు. ఉంటారు.