News

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా చాగంటి కోటేశ్వర రావు

242views

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుని ప్రభుత్వ సలహాదారుగా (నైతిక విలువలు, స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వ్యాల్యూస్) గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దీనికి కేబినెట్ హోదా వర్తిస్తుందని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. చాలా సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో పరిచయమే అక్కర్లేని పేరు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు.స్వస్థలం కాకినాడ. వీరు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగి పనిచేసి, పదవీ విరమణ పొందారు. తెలుగు ప్రవచన రంగంలో ‘‘తలలో నాలుకలా’’ గా వున్నారు. ముఖ్యంగా భారత, భాగవత, రామాయణాదులను అత్యంత సరళంగా ప్రవచనం చేశారు.

అలాగే వివిధ విషయాలు, పురాణాలు, నైతిక విలువలు, ప్రముఖ వ్యక్తులు, పీఠాధిపతులు, మఠాధిపతుల జీవిత చరిత్రలపై కూడా ఎన్నో ప్రసంగాలు చేశారు. కంచి పరమాచార్యుల గురించి, భగవాన్ రమణుల గురించి, అరుణాచలం గురించి విశేషంగా చెబుతూ అటు వైపు ఎందర్నో ఆకర్షితులను చేస్తున్నారు. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని భారతీయ ఇతిహాసాలు, పురణాలను ఇప్పటి యువతకు జోడిస్తూ ప్రవచనం చేస్తున్నారు. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ఆబాలగోపాళం వారి ప్రవచనాన్ని ఇష్టపడతారు. వీరి నియామకం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.