News

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం

399views

ఎంతో విశిష్ట చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆంగ్ల విభాగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి, సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టడీస్(కాప్స్) సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం – సదస్సు’ ముగిసింది.

సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఆదికవి నన్నయ, టంగుటూరి ప్రకాశం పంతులు, కందుకూరి వీరేశలింగం వంటి మహనీయులు నడయాడిన రాజమహేంద్రవరంలో ఇటువంటి సదస్సు నిర్వహించడం సంస్కృతి వైభవాన్ని పెంచేందుకు నాంధీ అన్నారు. రాష్ట్ర కోస్తా తీరం నాగరికతకు నెలవు అన్నారు. తెలుగు వారికి మాత్రమే ఉన్న గొప్ప సాహిత్య రూపం పద్య నాటకం, పౌరాణిక నాటకాలు అన్నారు.తెలుగు భాషా చాలా ప్రాచీనమైన భాషా అని, దానికి లిఖిత పూర్వక ఆధారాలు భద్రపరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి ప్రపంచ దేశాలకు తెలియ చెప్పాలన్నారు. సంస్కృతి వైభవం కోసం కృషి చేసే విధంగా మనమంతా ముందడుగు వేయాలని చెప్పారు. రాష్ట్రం నలుమూలల ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేసారు.

నన్నయ విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేసేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసేందుకు పాటుపడతామని చెప్పారు. కోటిలింగాల కొట్టుకొని పోకపోతే రాజమహేంద్రవరం మరో కాశీ అయ్యేదని, కానీ వీరేశలింగం వంటి సంఘ సంస్కర్త దేశాన్ని చైతన్య పరిచారని ఆరుద్ర వ్రాసిన వేదంలా ఘోషించే గోదావరి పాటలో విషయాలను తెలియజేస్తూ నృత్య ప్రదర్శన చేసిన విద్యార్థులను అభినందించారు.