అది ప్రకాశంజిల్లాలోని ఒక తీరప్రాంత మండలమైన కొత్తపట్నంలోని డంకన్ దొర కాలనీ. దాదాపు 50 కుటుంబాల యానాది సామాజిక వర్గానికి చెందిన వారు అక్కడ నివసిస్తున్నారు. సమాజానికి దూరంగా ఉంటూ కూలి చేసుకొని జీవించే వీరిపై మతమార్పిడి ముఠాల కన్నుపడింది. ఇంకేముంది? వెంటనే ఆ కాలనీలో వాలిపోయి నానా ప్రలోభాలకు గురిచేసి 12 కుటుంబాల వారిని మతం మార్చి చర్చి ఏర్పాటు చేశారు.
సమాజంలో రకరకాల కారణాలతో వివక్షకు గురై మతమార్పిడి ముఠాల ఉచ్చులో చిక్కుకుంటున్నవారికి హిందూధర్మ విశిష్టతను తెలిపి వారిలో ధార్మిక చైతన్యాన్ని నింపుతున్న సమరసాతా సేవా ఫౌండేషన్ ధర్మప్రచారకుల దృష్టికి ఈ ఉదంతం వెళ్ళింది.
వెంటనే వారు ఆ కాలనీకి వెళ్లి ఆ సంఘపెద్దలతో కలసి కూర్చుని చర్చించి ఆ కాలనీలో TTD వారి సహకారంతో దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ చేయడం జరిగింది.కాలనీలో హిందూధర్మ వెలుగులతో పండుగవాతావరణం ప్రారంభమైనది.కాలనీ అంతా పసుపు కుంకుమలతో శోభాయమానంగా వెలిగిపోతుంటే మతమార్పిడికి గురైన 12 కుటుంబాల వారిలో తిరిగి స్వధర్మలోకి వచ్చి తమవారిలో కలసిపోవాలనే కాంక్ష ప్రారంభమైంది. దానితో వారు ధర్మప్రచారకుల చొరవతో స్వధర్మంలోకి అడుగిడి అందరూ కలసి దేవాలయం నిర్మాణం పూర్తిచేసుకుని చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలవడం విశేషం.
ఈ సంఘటన ఒక్కటే కాదు ఇలాంటి అనేక సంఘటనలు SSF చేపడుతున్న కార్యక్రమాల పర్యవసానంగా మన కనులముందర సాక్షాత్కరిస్తున్నాయి.