ఆ మధ్య ఓ రాజకీయ విశ్లేషకుడు చెప్పాడు”రాజకీయ నాయకుల పరిభాష యొక్కఅంతర్యాన్ని అర్ధం చేసుకునే స్థాయికి ప్రజల విచక్షణ పెరగనంత వరకు రాజకీయాలు బాగుపడవు” అని. హిందూత్వాన్ని హిందువుల ద్వారానే దెబ్బ తీయడం రాజకీయాలలో వచ్చిన కొత్త ట్రెండ్. రాహుల్ గాంధీ శివ భక్తుడై జంధ్యం వేసినా, మమతా బెనర్జీ అర్జెంటుగా దుర్గా భక్తురాలి గా మారి రాయితీలు ఇవ్వటం లాంటివి చేస్తున్నా ఈ వ్యూహంలో భాగమే. సంఘటిత మవుతున్న హిందూ ఓట్ బ్యాంకును చెదరగొట్టటమే ఆ వ్యూహం.
విషయం లోకి వస్తే ఆంధ్రా లో జరుగుతున్న కొన్ని రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల గురించి అలోచిద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి శ్రీ L.V. సుబ్రహ్మణ్యం దేవాలయాల్లో అన్యమత ఉద్యోగుల గురించి చేసిన ప్రకటన హిందూ మత సంస్థలకు ఆనందం కలిగించిందనే చెప్పవచ్చు. అది సక్రమంగా అమలు చేస్తే సంతోషమే. కానీ కాస్త లోతుగా విషయాన్ని విశ్లేషిస్తే ప్రభుత్వం తీసుకోబోతున్న, తీసుకున్న మరి కొన్ని నిర్ణయాలపై ప్రజల నుండి ప్రతిఘటన రాకుండా ముందస్తుగా తీసుకుంటున్న ముందు జాగ్రత్త నిర్ణయం కాబోలనిపిస్తోంది. ఆ నిర్ణయాలలో మొదటిది భారత దేశంలో ఎక్కడా లేని విధంగా దేవాలయ కమిటీల నియామకాలాలో రిజర్వేషన్లు అమలు చెయ్యాలనే ఏపీ ప్రభుత్వం యొక్క సరి కొత్త ఆలోచన.
అసలు అంబేడ్కర్ రిజర్వేషన్లు పెట్టటంలో ఆంతర్యం బడుగు బలహీన వర్గాలు ఆర్ధికంగా, రాజకీయంగా సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా ఎదగాలని కదా? అందులో భాగంగానే చదువులలో, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు. అంతవరకు బాగానే వుంది. కానీ ఈ రిజర్వేషన్ విధానాన్ని గుళ్లలోకి కూడా ఎందుకు తీసుకువస్తున్నారు? దైవంపై భక్తి, విశ్వాసం ప్రాతిపదికన కాకుండా కుల ప్రాతిపదికన ఆయా వ్యక్తుల నియామకం జరిగితే దేవాలయాల అభివృద్ధి ఎలా జరుగుతుంది? దేవాలయాలను ఆదాయ మార్గాలుగా మలుచుకుంటున్న రాజకీయ వ్యవస్థ వల్ల అసలే దేవాలయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. దీనికి కుల జాడ్యం కూడా అంటించటం వల్ల సామాజిక అశాంతి పెరిగిపోదా? దేవాలయ కమిటీలక్కూడా ఈ కుల గజ్జి అంటించటం వల్ల హిందూ సమాజంలో అంతర్గత విభేదాలు మరింత పెరుగుతాయి. అసలు దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించాలని హిందూ సంఘాలు కోరుతుంటే అది చేయకుండా క్రొత్తగా ఈ రిజర్వేషన్ విధానమేంటి? ఏం సాధించటానికి? ఏం సంస్కరించటానికి? పైగా రికార్డుల పరంగా హిందువులుగానే ఉన్నా క్రైస్తవాన్ని ఆచరించే వాళ్ళు దేవాలయ వ్యవస్థలోకి చొరబడరని నమ్మకం ఏమిటి? జగన్ గారు మొదట ఈ విధానాన్ని చర్చి కమిటీలలో అమలు చేసి చూపగాలరా? నిజానికి గ్రౌండ్ లెవెల్లో నిజానిజాలు చూస్తే చర్చిలలో కుల పరమైన చర్చిలు ఎన్ని లేవు? వాటి కమిటీల నియామకంలో ఈ రిజర్వేషన్ విధానం అవసరం లేదా? ఇమాంలకు, పాష్టర్లకు జీతాలిచ్చి పోషించటానికి సిద్ధపడుతున్న ప్రభుత్వం చర్చిలను, మసీదులను ప్రభుత్వ అజమాయిషీలోకి తీసుకురావాలని ఎందుకు అనుకోవటం లేదు?
సహజంగా కొన్ని గ్రామాలలో దేవాలయాల సమీపంలో ఏదో ఒక కులం వారు అధిక సంఖ్యలో ఉండటం, ఆ దేవాలయ కమిటీలో వారే అజమాయిషీ వహించటం జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఆ దేవాలయ నిర్వహణలో మిగిలిన వర్గాల ప్రజల యొక్క భాగస్వామ్యం సహజంగానే తక్కువగా ఉండటం. ఉదాహరణకు ఒక అరుంధతీయ వాడలో మాతమ్మ గుడి ఉంటుంది. సహజంగా ఆ గుడి నిర్వహణలో అరుంధతీయులే పాలు పంచుకుంటారు. గ్రామంలోని మిగతా వారి భాగస్వామ్యం చాలా తక్కువ ఉంటుంది. అలాగే హరిజనవాడలో ఉండే దేవాలయంలో హరిజనులే పెత్తనం వహించడం సహజం. అలాగే మిగతా గ్రామంలో కూడా ఆ దేవాలయ సమీపంలో అధికంగా వుండే సామాజిక వర్గ ప్రజలు సహజంగా దాని నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇతరుల జోక్యాన్ని సహించలేక పోవచ్చు కూడా. వీటిలో రిజర్వేషన్లు వర్తింపజేయాలనుకోవటం అనవసరంగా గ్రామాలలో కులాల కుంపటి రాజేయటమే అవుతుంది. ఇది ఖచ్చితంగా హిందూ సమాజాన్ని చీల్చటానికి చేస్తున్న కుట్రే.
దేవాలయ భూములను పేద ప్రజలకు పంపిణీ చేస్తారట. భూమి లేని సాధారణ ప్రజలకు ఇది వినసొంపుగా ఆనందం కలిగిస్తుంది. మరి రాష్ట్ర స్థాయిలో గానీ, దేశవ్యాప్తంగా గానీ చూస్తే ఓ అంచనా ప్రకారం ప్రభుత్వ ఆస్తుల తర్వాత ఆ స్థాయిలో ఆస్తులు కలిగి ఉన్నది క్రైస్తవ సంస్థలకే. మరి రాష్ట్ర ప్రభుత్వం చర్చి భూములుగాని, వక్ఫ్ బోర్డు స్ధలాలుగాని సేకరించి ఎందుకు పేదలకు పంపిణీ చెయ్యకూడదు? కేవలం హిందూ దేవాలయాలని మాత్రమే ఆర్ధికంగా ఎందుకు బలహీన పరచాలని ప్రయత్నిస్తున్నారు? దీనికి సామాజిక న్యాయం, పేద ప్రజల అభివృద్ధి కోసం అనే రంగులు ఎందుకు అద్దుతున్నారు? మిగతా మతస్థులకు దాతలు విరాళం గా ఇచ్చిన వాటి జోలికి ఎందుకు పోరు? అసలే పేద హిందువులు ఇతర మత సంస్థలు చూపే ఎరలకు లోబడి మతం మారుతున్నారు. ఇప్పుడు పేదలకు ఇళ్ళు కట్టించి ఇద్దామనుకుంటే హిందూ సంస్థలు అడ్డుపడుతున్నాయని వారిని పేదల దృష్టిలో విలన్లుగా చూపాలని అనుకుంటున్నారా?
హిందూత్వంపై భవిష్యత్తులో జగన్ అనుసరించబోయే విధానానికి గొప్ప ఉదాహరణ TTDలో శేఖర్ రెడ్డి నియామకం. ఆ మధ్య CBI దాడులలో వందల కోట్ల రూపాయలు దొరకటంతో వార్తలలో నిలిచిన వ్యక్తి శేఖర్ రెడ్డి. సారా కాంట్రాక్టర్ ఆదికేశవులు నాయుడు మొదలు ఈరోజు శేఖర్ రెడ్డి వరకు ఏదో అదృశ్య శక్తి TTD పాలక మండలి నియామకాలను ప్రభావితం చేస్తున్నది. వేల కోట్ల ఆస్తి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంపై అజమాయిషీకి నియమించిన కమిటీని చూస్తే దేవాలయ కమిటీలలో సభ్యత్వం పొందటానికి ప్రామాణికం “హిందూధర్మం పై శ్రద్ధ ఉండటమా?”లేక “అక్రమ సంపాదనల పైన శ్రద్ధ ఉండటమా?”అర్థం కాదు. ప్రస్తుత పాలక మండలి సభ్యులలో ఒక్కరిద్దరిని తప్పిస్తే ఎవ్వరి చరిత్ర గొప్పదేమీ కాదు. భవిష్యత్తులో రిజర్వేషన్లతో కూడిన దేవాలయ కమిటీల నియామకాలకు ఇదే ప్రామాణికం అయితే హిందువులు తమ వేలితో తమ కళ్ళు పొడుచుకున్నట్లే. ఏ అర్హతల ఆధారంగా శేఖర్ రెడ్డిని ” శేఖర్” పేరుతో TTD మెంబర్ని చేశారు? పేరు కాస్త కుదిస్తే ప్రజలకు అర్థం కాదా? ఒకప్పుడు తామే తీవ్రంగా విమర్శించిన శేఖర్ రెడ్డిని “శేఖర్”పేరుతో నియమించినంత మాత్రాన ప్రజలకు కాకుంటే ఆ దైవానికైనా తెలియక పోతుందా? పార్టీ ఏదైనా దేవాలయాలను దోచుకోవటంలో అందరూ ఒక్కటే అని ఋజువైంది. కానీ తన జోలికి వచ్చిన వారికి ఆ దైవం ఎలాంటి గుణపాఠం నేర్పాడో ప్రభుత్వ, ప్రతిపక్ష నాయకులతో సహా ప్రజలందరికీ తెలుసు.
హిందూ జాతికి విజ్ఞప్తి. గుడ్డి అభిమానాలకు అతీతంగా”నిరంతర అప్రమత్తతే హిందూ జాతికి శ్రీరామ రక్ష”లేకుంటే తప్పదు శిక్ష. “రాజకీయ నాయకుల పరిభాష అర్ధం చేసుకుందాం – వాళ్ళ చర్యలు మన దైవానికి, ధర్మానికి హాని కలిగిస్తాయనుకుంటే వారి రాజకీయ జీవితానికి ఆరోజే సమాధి కడదాం.” మనలోని ఇలాంటి అప్రమత్తత, ధార్మిక జాగరణ మాత్రమే సంకుచిత, స్వార్ధ, కుటిల రాజకీయాల నుంచి హిందూ సమాజాన్ని, సంస్కృతిని రక్షించగలుగుతుంది.
అసలింతకీ ఈ విషయాలపై ప్రజలు, హిందూ సంస్థలు, ధర్మాచార్యులు చెందుతున్న ఆందోళనకు, సంధిస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పట్లేదు. ప్రజల సందేహాలను ఎందుకు నివృత్తి చేయ్యాలనుకోవటం లేదు? మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళడం ప్రభుత్వ వ్యూహమైతే ప్రభుత్వం గమనించవలసిన విషయం ఒకటుంది. హిందూ సమాజం పూర్వంలా నిద్రావస్థలో లేదు. మొన్నటికి మొన్న కేరళలో శబరిమలై దేవాలయాన్ని అపవిత్రం చెయ్యాలని ప్రయత్నించిన అక్కడి వామపక్ష ప్రభుత్వానికి ప్రజల నుంచి ఎంత తీవ్రమైన ప్రతిఘటన ఎదురైందో చూశాం. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ సాధించిన ఫలితాలనూ చూశాం. ఎక్కడిదాకానో ఎందుకు? మన రాష్ట్రంలో సైతం అభివృద్ధి పేరుతో 40 గుళ్ళు కూల్చిన వారికి జరిగిన ఘోర పరాభవం చూశాం. హిందూ సమాజం ప్రభుత్వాల అఘాయిత్యాలని మౌనంగా భరించినట్లే కనిపిస్తుంది. తగు సమయమొచ్చినప్పుడు మౌనంగానే బదులిస్తోంది. ప్రభుత్వమేదైనా, అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా హిందూత్వ ప్రయోజనాల విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సిందేనని అర్ధం చేసుకుంటే మంచిది. కాదని ఆహంకరిస్తే…. హిస్టరీ రిపీట్స్.
రచన – గజ్జెల మోహన్, విజయవాడ.