News

హిందూ దళిత మైనర్ బాలిక అత్యాచారం, హత్య : నిందితుడు జకీర్ ఖాన్ అరెస్ట్

265views

రాజస్థాన్‌లోని బికనేర్ జిల్లాలో ఒక హిందూ దళిత మైనర్ బాలిక శవం ఒక బావిలో దొరికింది. బాలిక గురించి మూడు రోజుల పాటు తీవ్రంగా వెతికిన తర్వాతనే ఆమె శవం పోలీసులకు లభ్యమైంది. మృతురాలు 16ఏళ్ళ హిందూ దళిత బాలిక అని పోలీసులు నిర్ధారించారు. ఆ అమ్మాయి తప్పిపోయిందని ఆమె తల్లిదండ్రులు నవంబర్ 2న ఫిర్యాదు చేసారు.

పోలీసులు చెప్పిన వివరాల మేరకు, మృతురాలు రాజస్థాన్ నాగౌర్ జిల్లా శ్రీ బాలాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యామ్సార్ ప్రాంతానికి చెందిన బాలిక. ఆ అమ్మాయి కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు నవంబర్ 2న ఫిర్యాదు చేసారు. దాంతో పోలీసులు ఆ బాలిక గురించి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఆమె శవం నవంబర్ 7 గురువారం నాడు ఒక బావిలో దొరికింది.

మృతురాలి తల్లిదండ్రులు జకీర్ ఖాన్ అనే వ్యక్తి మీద అనుమానం వ్యక్తం చేసారు. దాంతో పోలీసులు ముందుగా జకీర్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతను వయోజనుడు, వివాహితుడు. మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఆకట్టుకుని, చాలాకాలంగా లైంగికంగా దోచుకుంటున్నాడు.

విషయం తెలిసిన బాలిక కుటుంబం, ఆమెను పెళ్ళి చేసుకోవాలంటూ జకీర్ ఖాన్‌ను కోరారు. ఆ విషయం గురించి మాట్లాడాలంటూ ఒప్పించి, జకీర్ ఖాన్ ఆ బాలికను నాగౌర్ పక్కనే ఉన్న బికనేర్ జిల్లాలోని పంఛూ ప్రాంతంలో ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆమెను చంపేసి, ఆమె శవాన్ని ఒక పాడుబడిన బావిలో పడేసాడు.

పోలీసులు నిందితుడు జకీర్ ఖాన్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ కోసం న్యాయస్థానం అతన్ని ఐదు రోజుల పోలీస్ రిమాండ్‌కు అప్పగించింది.