News

చంద్రయాన్‌-2…. 98శాతం విజయవంతమైంది – ఇస్రో శివన్

419views

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం 98శాతం విజయవంతమైందని ఇస్రో అధినేత శ్రీ కె.శివన్‌ తెలిపారు. భువనేశ్వర్‌ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రయాన్‌-2లోని ఆర్బిటర్‌ చాలా బాగా పనిచేస్తోందని తెలిపారు. ఆర్బిటర్‌లో 8 సైన్స్‌ పరికరాలు ఉండగా అవన్నీ తమ లక్ష్యాలను సక్రమంగా నెరవేరుస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా విక్రమ్‌ ల్యాండర్ గురించి ప్రస్తావిస్తూ దానితో ఇంకా సంబంధాలు పునరుద్ధరించలేకపోయామని తెలిపారు. విక్రమ్‌తో కమ్యూకేషన్‌ తెగిపోడానికి గల కారణాలను ఇస్రో నిపుణులు శోధిస్తున్నారని అన్నారు. వారి నివేదిక అనంతరం తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. మరోవైపు చంద్రుడిపై పగటి సమయం నేటితో ముగిసి రెండు వారాల పాటు సాగే రాత్రి మొదలుకానుంది. దీంతో విక్రమ్‌ ల్యాండర్‌ కథ ఇక సమాప్తమైనట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

తదుపరి లక్ష్యం ‘మిషన్‌ గగన్‌యాన్‌’

ఇస్రో తదుపరి లక్ష్యం ‘గగన్‌యాన్‌ మిషన్‌’ అని శివన్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇస్రో చరిత్రలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్‌యాన్‌’. దీని ద్వారా 2022 నాటికి భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. సాయుధ బలగాల్లో ఫ్లయింగ్ అనుభవం ఉన్న టెస్ట్‌ పైలట్లను వ్యోమగాములుగా పంపాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టింది. ముగ్గురిని ఎంపిక చేసి వారికి తొలుత భారత్‌లో తర్వాత రష్యాలో ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నారు. గగన్‌యాన్‌ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే.. స్వతంత్రంగా మానవులను అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్‌ ఘనత దక్కించుకోనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.