News

11 నుంచి భవానీ దీక్షల స్వీకరణ

236views

విజయవాడ దుర్గగుడిలో ఈనెల 11 నుంచి భవానీల దీక్ష స్వీకరణ ప్రారంభమవుతుందని ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. కార్తీకశుద్ధ దశమి అనంతరం ఏకాదశి తిథిలో ఈనెల 11న ఉదయం 7 గంటలకు మండల దీక్ష స్వీకరణ ప్రారంభమవుతుంది. 15న సమాప్తి అవుతాయి. డిసెంబరు 1న అర్ధ మండల దీక్షల స్వీకరణ ప్రారంభమవుతుంది. 5న ముగుస్తాయి. 14న సత్యనారాయణపురంలోని రామకోటి మైదానంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి ఆరోజు సాయంత్రం 6.30 గంటలకు కలశజ్యోతి ఉత్సవం ప్రారంభమవుతుంది. నగరోత్సవంలో పాల్గొన్న అమ్మవారు తిరిగి దేవస్థానానికి చేరతారు. డిసెంబరు 21 నుంచి 25 వరకు దీక్షల విరమణలు జరుగుతాయి.

21న ఉదయం 6.30 గంటలకు దీక్షల ముగింపు సందర్భంగా అగ్ని ప్రతిష్ఠాపన, శతచండీయాగం, గిరి ప్రదక్షిణలు, భవానీ దీక్షల విరమణలు జరుగుతాయి. డిసెంబరు 25న ఉదయం 10 గంటలకు దీక్షల విరమణలు సమాప్తి అవుతాయి. ఉదయం 10 గంటలకు మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. డిసెంబరు 21 నుంచి 26 వరకు దేవస్థానంలో ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఇవన్నీ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తారు.

కార్తీక మాసం సందర్భంగా మల్లేశ్వర స్వామికి ప్రతిరోజూ మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రలింగార్చన, ప్రతిరోజూ మధ్యాహ్నం 3నుంచి రాత్రి 7గంటల వరకు నిర్వహిస్తారు. రూ.500 రుసుము చెల్లించి భక్తులు పాల్గొనవచ్చు. కార్తీక సోమవారం ఏకాదశి, పౌర్ణమి, మాస శివరాత్రి రోజుల్లో బిల్వార్చన, ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతాయి. రు.2000లు చెల్లించి భక్తులు పాల్గొనవచ్చు.