News

విశ్వ విద్యాలయాలా? అరాచక శక్తుల అడ్డాలా?

440views

ఢిల్లీ యూనివర్సిటీలో తుకడే తుకడే గ్యాంగు ఆగడాలను మరువక ముందే బెంగాల్లో మరో యూనివర్సిటీలో సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రి పట్ల వామపక్ష, ఇస్లామిక్ మూకల దౌర్జన్యం యావద్దేశాన్నీ విస్మయానికి గురిచేస్తోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బెంగాల్ అరాచక శక్తులకు కేంద్రంగా మారుతోందా? అనిపిస్తోంది. కొంత మంది వామపక్ష భావజాల ప్రేరిత విద్యార్ధులు తీవ్రవాదులకంటే ఘోరంగా సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రినే జుట్టు పట్టుకుని క్రిందికి తోసి అవమానించిన సంఘటన చూసినవారెవరికైనా అసలు బెంగాల్లో ప్రజాస్వామ్యయుత పాలన ఉందా? లేక బెంగాల్ అరాచక వాదుల అడ్డాగా మారిపోయిందా? అన్న సందేహం కలుగక మానదు.

కేంద్ర అటవీ, పర్యావరణశాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం మధ్యాహ్నం జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లగా విద్యార్థులు ఆయనపై దాడి చేశారు. ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే ఆయన్ను వందలాది మంది వామపక్ష భావజాల విద్యార్థి సంఘం నాయకులు చుట్టుముట్టి ‘గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ), అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్‌ఎఫ్‌ ) జెండాలు ప్రదర్శించారు. పెద్ద ఎత్తున తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మంత్రి సెక్యూరిటీ సిబ్బంది తుపాకులు కూడా కింద పడిపోయాయి. కేంద్ర మంత్రి సుప్రియోను ప్రాంగణంలోకి అనుమతించేది లేదని విద్యార్థులు తేగేసి చెప్పారు. ఇంతలో విశ్వ విద్యాలయ ఉప కులపతి అయిన సురంజన్‌ దాస్‌ కలగజేసుకున్నా ఫలితం లేకపోయింది.

చివరికి పటిష్ఠ బందోబస్తు మధ్య ఆడిటోరియంలోకి చేరుకున్న కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో మాట్లాడుతూ.. ”నేను రాజకీయాలు చేసేందుకు ఈ ప్రాంగణంలోకి రాలేదు. విద్యార్థులు ప్రవర్తించిన తీరు నన్ను బాధించింది. జుట్టు పట్టుకొని, నన్ను తోసేశారు. ఇది జరగకుండా ఉండాల్సింది. నిరసనకారులు విద్యార్థులను రెచ్చగొట్టి ప్రశాంతమైన ప్రాంగణంలో తొక్కిసలాట సృష్టించారు. ఉద్రిక్తత సమయంలో నిరసన చేస్తున్నవారు తమకు తాము నక్సల్స్‌ అని చెప్పుకొని నన్ను ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.” అని అన్నారు. తిరిగి సాయంత్రం 5 గంటల సమయంలో మంత్రి వెళ్లిపోయేటప్పుడు కూడా ఈ విధమైన ఆందోళనే ఎదుర్కొన్నారు.

అయితే, విద్యార్థులు కేంద్ర మంత్రిని అడ్డుకున్నందుకు గల కారణాలపై విచారణ జరిపి నివేదికను ఛాన్సలర్‌ అయిన గవర్నర్‌కు అందజేస్తామని ఉపకులపతి సురంజన్‌ దాస్‌ తెలిపారు.

దీదీ… వీరిపై చర్యలు తీసుకోగలరా?

జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో గురువారం తనపై జరిగిన దాడికి సంబంధించి కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో కొన్ని వీడియోలు, చిత్రాలను విడుదల చేశారు. వీటిలో ఉన్నవారిని వెతికి పట్టుకొని చర్యలు తీసుకోగలరా? అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రియో సవాల్‌ విసిరారు. విశ్వవిద్యాలయానికి హాని తలపెట్టే లేదా కళంకం తెచ్చే ఇలాంటి పిరికివాళ్లను వదిలి పెట్టవద్దని శుక్రవారం ట్వీట్‌ చేశారు. దాడికి పాల్పడిన వారిని ఉద్దేశిస్తూ.. ”మీరు మాకు బయట కచ్చితంగా పట్టుబడతారు. కానీ, మీరు ఏం భయపడక్కర్లేదు. ఎందుకంటే మీరు నాపై దాడి చేసినట్లుగా, నేను చేయను.” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన తనపై దాడి జరుగుతున్న కొన్ని వీడియోలను పోస్ట్‌ చేసి.. ”ఈ నక్సలైట్‌ను గుర్తించండి.. ఈయన జాదవ్‌పూర్‌ వర్సిటీ విద్యార్థేనా? ఒకవేళ అయితే, అతనికి ఉద్రిక్తతలు సృష్టించడమే పనా?’ అని మరో ట్వీట్‌ చేశారు.