కార్పొరేట్ పన్ను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా వాణిజ్య వర్గాలు స్వాగతించాయి. భారత్ కేంద్రంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇది ఒక మంచి అవకాశం అని వారు అభిప్రాయపడ్డారు. తాజా నిర్ణయం ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని గాడిలో పెడుతున్నట్లు భావిస్తున్నామని భారత్-అమెరికా వ్యూహత్మక భాగస్వామ్య వేదిక(యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) అధ్యక్షుడు ముఖేశ్ ఆఘి అన్నారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు సహా ఇతర ఉద్దీపన చర్యలు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే అవకాశం ఉందని చెప్పారు. సులభతర వాణిజ్యం కోసం భారత్ తీసుకుంటున్న అన్ని రకాల చర్యలకు యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ మద్దతుగా ఉంటుందన్నారు. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య విభేదాలు తొలగిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఆర్థిక మంత్రి సీతారామన్ తీసుకున్న నిర్ణయాలు ఉపకరిస్తాయని భారత్-అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కరుణ్ రుషి అభిప్రాయపడ్డారు. ఉత్పాదక రంగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలనకుంటున్న సంస్థలకు కార్పొరేటు పన్ను తగ్గించడం శుభపరిణామం అని.. దీనివల్ల అంతర్జాతీయ సంస్థలు భారత్ తరలే అవకాశం ఉందన్నారు. తాజా నిర్ణయాల వల్ల పెట్టుబడులతో పాటు ఉద్యోగ కల్పన సైతం పుంజుకుంటుందని పేర్కొన్నారు. పరిశోధన రంగం, అంకుర సంస్థలు వృద్ధి చెంది నవ ఆవిష్కరణలకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు.
వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠానికి చేరిన వేళ పెట్టుబడులను ఆకర్షించి, పరిశ్రమలను స్థాపించడంతో పాటు వృద్ధిని పరుగు పెట్టించడమే లక్ష్యంగా కార్పొరేట్ పన్నులో 10 శాతం వరకు తగ్గింపును కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కార్పొరేట్ పన్ను రాయితీలు దేశ పారిశ్రామిక రంగాలన్నింటిలోనూ జోష్ నింపాయి. అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం వల్ల కొన్ని అమెరికా కంపెనీలను చైనా నుంచి మనదేశం వైపు ఆకర్షించటం కూడా తాజా నిర్ణయం ఉద్దేశంగా తెలుస్తోంది.
Source : Enadu.