ArticlesNews

పాతాళంలోనూ ఇస్రో పరిశోధనలు

52views

ఆకాశం వైపు గురిపెట్టి అంతరిక్ష ప్రయో­గాలు చేయడానికే పరిమితమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అడుగు ముందుకేసి పాతాళంలోకి వెళ్లి పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది. సముద్రయాన్‌ పేరిట ఈ ప్రయోగాలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. గతంలో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టినా.. ఇంతటి సాంకేతికతను ఉపయోగించలేదు. 1980లోనే సముద్రాలపై అధ్య­యనం చేయడానికి స్కూబా డైవింగ్‌ పద్ధతిలో అధ్యయనానికే పరిమితమయ్యారు.

దేశం చుట్టూ 7 వేల కిలోమీటర్ల సముద్ర తీరం ఉండటంతో దీనిపై అధ్యయనం చేయాలనే ఆలోచన పురుడు పోసుకుంది. 2019 నుంచి ఈ ప్రయత్నాలు సాగిస్తున్నా.. ఇప్ప­టికి దీనికి ఓ రూపం వచ్చింది. ప్రస్తుతం సముద్ర గర్భంలో సుమారు 6వేల మీటర్ల లోతుకెళ్లి అధ్యయనం చేసేందుకు సముద్రయాన్‌ పేరుతో మత్స్య–6000 అనే సబ్‌మెర్సిబుల్‌ నౌకను పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.

సబ్‌మెర్సిబుల్‌ వాహనంలో..
ప్రపంచంలో మానవ రహిత జలాంతర్గాములు ఉన్నాయి. భారత్‌ విషయానికి వస్తే మానవ సహిత జలాంతర్గామిని తయారు చేసిన చరిత్ర ఉంది. సముద్రయాన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా సముద్ర గర్భంలోకి వెళ్లి పరిశోధనలు చేసేందుకు వీలుగా సబ్‌మెర్సిబుల్‌ వాహనాన్ని ఎన్‌ఐఓటీ డిజైన్‌ చేసి అభివృద్ధి చేస్తోంది. ఈ వాహనానికి మత్స్య–6000 అని నామకరణం చేశారు. ఈ వాహనం 6 కిలోమీటర్ల లోతుకు వెళ్లినపుడు నీటి పీడనం 600 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు.

ఈ పీడనాన్ని తగ్గించేందుకు టైటానియం అలాయ్‌ను ఉపయోగించి నీటి పీడనాన్ని తట్టుకునేలా సబ్‌మెర్సిబుల్‌ వాహనాన్ని డిజైన్‌ చేస్తున్నారు. 2022 డిసెంబర్‌లో ‘సాగర్‌ నిధి’ నౌకను హిందూ మహాసముద్రంలోకి పంపిన విషయం తెలిసిందే. ఓషన్‌ మినరల్‌ ఎక్స్‌ప్లోరల్‌ పేరిట సముద్ర గర్భంలో 5,271 మీటర్ల లోతులో అన్వేషణ సాగించారు. అక్కడున్న మాంగనీస్‌పై పరిశోధించారు. ఇప్పుడు మత్స్య–6000 ప్రయోగంలో ముగ్గురు వ్యక్తులు వాహనంలో వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో ఒకరు సబ్‌మెర్సిబుల్‌ వాహనం ఆపరేటర్‌ కాగా.. మిగిలిన ఇద్దరు పరిశోధకులు ఉంటారు.

గంటల తరబడి సముద్రంలోనే..
ఈ వాహనం సముద్ర గర్భంలో 108 గంటలు ఉండేలా వాహనాన్ని డిజైన్‌ చేస్తున్నారు. సముద్ర గర్భంలోకి పోవడానికి 3 గంటలు, మళ్లీ పైకి రావడానికి 3 గంటలు సమయం తీసుకుంటుందని ఓషన్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ సంస్థకు ఇస్రో కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించింది. ఇస్రో చేసిన చంద్రయాన్‌–3 ప్రయోగం, భవిష్యత్‌లో చేయబోతున్న గగన్‌యాన్‌ మిషన్‌ ప్రయోగ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంతమేరకు వినియోగించుకుంటున్నారు. మత్స్య–6000 జలాంతర్గామిని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో తయారు చేశారు.

ఈ వాహనం సంక్లిష్టమైన సమయంలో 96 గంటలు నీటిలోనే ఉండేందుకు వీలుగా 67 ఆక్సిజన్‌ సిలిండర్లు ఏర్పాటు చేశారు. సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతంలో 108 గంటలపాటు సముద్రంలోనే ఉండేలా మత్స్య–6000 డిజైన్‌ చేశారు. ఈ పరిశోధనల్లో సముద్ర గర్భంలో ఉన్న మాంగనీస్‌ కోబాల్ట్, నికెల్‌ లాంటి ఖనిజాల అన్వేషణలతో పాటు సముద్ర గర్భంలో వాతావరణ పరిస్థితులు రుతుపవనాల రాకపోకలు లాంటి వాటిపై అధ్యయనం చేయడానికి ఇది దోహదపడుతుంది.

ఖనిజాలు.. వాతావరణ పరిస్థితులపై అధ్యయనానికి..
భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్స్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓçషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంయుక్తంగా సముద్ర గర్భంలో ఖనిజాల అన్వేషణ, సముద్రాల నుంచి వచ్చే రుతు పవనాలు, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు మత్స్య–6000 అనే పేరుతో సముద్రయాన్‌ ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. సముద్రపు అడుగున ఏముందో పరిశోధనలు చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. సుమారు రూ.4 వేల కోట్లతో 2026 నాటికి ఈ ప్రయోగాన్ని చేసేందుకు ఓషన్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలు సంయుక్తంగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.