
చారిత్రక నేపథ్యంతో పాటుగా పురాణ ఇతిహాసాలతో ముడిపడి ఉన్న పలు శివాలయాలకు విజయవాడ కేంద్రంగా ఉంది. కార్తికమాసం పరమశివునికి అత్యంత విశేషమైనదిగా చెబుతారు. శనివారం నుంచి కార్తికమాసం ప్రారంభమైంది. శివునికి ఈ నెలలో చేసే ప్రతి పూజా అద్భుతమైన ఫలాన్ని అందిస్తుందని పండితులు పేర్కొంటారు. అటు వంటి కార్తికమాసంలో నగరంలోని శివాలయాల్లో స్వామివారికి పలు రకాల పూజలను నిర్వహించేందుకు ఆయా ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఇంకా నగరంలోని ప్రముఖ శివాలయాల్లో బుద్దు వంశీయులు నిర్మాణం చేశారని చెబుతున్న వన్‌టౌన్ బ్రాహ్మణవీధిలో ఉన్న శ్రీ వసంత మల్లికార్జునస్వామి ఆలయం, వన్‌టౌన్ సైకంవారివీధిలోని శ్రీ గంగా సమేత దర్భేశ్వరస్వామి వారి ఆలయం, గవర్నరుపేట చల్లపల్లి బంగ్లా సమీపంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి దేవస్థానం కూడా ఉన్నాయి.
మల్లేశ్వరస్వామి ఆలయం (దుర్గగుడి)
ఇంద్రకీలాద్రిపై బ్రహ్మాది దేవతల అభీష్టం మేరకు ఆదిపరాశక్తి మహిషమర్దని స్వరూపంతో అవతరించింది. విశేష తేజస్సుతో కనకవర్ణంతో వెలుగొందుతున్న ఆ అమ్మ కాలక్రమంలో కనకదుర్గగా పేరొందింది. ఆ పర్వతంపైనే ఈశ్వరుణ్ణి కూడా కొలువుండేలా చేయాలని భావించిన బ్రహ్మ శతాశ్వమేఽథ యాగాల్ని చేశాడు. సంతసించిన పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంతో ఆ బ్రహ్మదేవునికి దర్శనమిచ్చినట్లు స్కాంధ పురాణంలో పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి మీద దివ్యజ్యోతిర్లింగ స్వరూపుడై నిలిచిన పరమేశ్వరుణ్ణి బ్రహ్మ మల్లీకదంబ పుష్పాలతో అర్చించాడు. అందుకే ఆ స్వామికి మల్లేశ్వరుడు అనే పేరు వచ్చింది. కాలక్రమంలో జ్యోతిర్లింగం అదృశ్యంగా ఉండటాన్ని చూసిన శ్రీ శంకరాచార్యులవారు కనకదుర్గాదేవికి ఉత్తర భాగంలో మల్లేశ్వర లింగాన్ని పునఃప్రతిష్ట చేశారు.





