
హిమాలయాల్లోని గఢ్‌వాల్ పర్వతశ్రేణుల్లో గల చార్‌ధామ్ ఆలయాలు శీతాకాలం కారణంగా వరుసగా మూతపడుతున్నాయి. సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తున ఉన్న గంగోత్రి మందిర ద్వారాలను మూసివేసినట్లు ఆలయ కమిటీ కార్యదర్శి సురేశ్ సెమ్వాల్ తెలిపారు. అన్నకూట్ ఉత్సవాల శుభ సందర్భంగా మధ్యాహ్నం 12.14 గంటలకు పూజా కార్యక్రమాలను ముగించాక.. ‘హర్ హర్ గంగే, జై మా గంగే’ అంటూ భక్తులు, పూజారుల ఉచ్చారణల నడుమ ద్వారాలు మూసివేసినట్లు వెల్లడించారు. సమీపంలోని ముఖ్బా గ్రామస్థుల కోసం ఆలయం వెలుపల పల్లకీలో గంగామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, విపరీతంగా మంచు కురిసే శీతాకాలమంతా వారు అక్కడ ఆరాధనలు జరుపుతారని చెప్పారు. ఈ సీజనులో 8 లక్షలకు పైగా భక్తులు గంగోత్రిని సందర్శించారు. చార్‌ధామ్ సమూహంలోని యమునోత్రి, కేదార్‌నాథ్ ఆలయాలు మూతపడనున్నాయి. బద్రీనాథ్ మందిరాన్ని ఈ నెల 17న మూసివేస్తారు. ఏటా వేసవి ప్రారంభంతో ఏప్రిల్ – మే నెలల్లో ఈ ఆలయాలు మళ్లీ తెరుచుకుంటాయి.





