News

ఒకటిన బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌లో దీపావళి వేడుకలు

69views

దీపాల పండుగ దీపావళిని దేశవ్యాప్తంగా అక్టోబర్ 31న జరుపుకోనుండగా, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లలో నవంబర్ ఒకటిన జరుపుకుంటున్నారు. తాజాగా దీపావళి పండుగను నవంబర్ 1న జరుపుకోవాలని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు ఉత్తరాఖండ్‌ అంతటా నవంబర్ ఒకటిన దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు. బద్రీనాథ్ ధామ్‌కు చెందిన పండితుడు రాధా కృష్ణ తప్లియాల్ తెలిపిన వివరాల ప్రకారం ఈసారి అమావాస్య రెండు రోజుల పాటు వచ్చింది. ప్రదోష కాలం తరువాత కూడా అమావాస్య ఉంటుంది. అందుకే నవంబర్ ఒకటిన మహాలక్ష్మి పూజ చేయాల్సి ఉంటుంది. దీపావళి పండుగను కూడా అదే రోజు చేసుకోవాల్సి ఉంటుంది.

నిజానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముందుగా నవంబర్ 1న దీపావళి సెలవు ప్రకటించింది. అయితే తరువాత దానిని సవరించి అక్టోబర్ 31న సెలవు ప్రకటించింది. తిరిగి ఇప్పుడు దీపావళి అధికారిక సెలవుదినం నవంబర్ ఒకటిగా పేర్కొంది. బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో నవంబర్‌ ఒకటిన దీపావళి వేడుకలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా వెలువడిన 250 పంచాంగాలలో 180 పంచాంగాలలో నవంబర్ ఒకటిన దీపావళిని జరుపుకోవాలని తెలియజేశాయని, అందుకే ఉత్తరాఖండ్‌లో నవంబర్ ఒకటిన దీపావళి జరుపుకుంటున్నట్లు రాష్ట్రానికి చెందిన జ్యోతిష్య నిపుణులు తెలిపారు.