
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో జరిగే నాగుల చవితి వేడుకలకు అన్ని శాఖల అధికారులు సహకరించి జయప్రదం చేయాలని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు కోరారు. మోపిదేవిలోని ఆలయ ప్రాంగణంలో అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లా డుతూ.. నవంబర్ ఐదో తేదీన నాగుల చవితి వేడుకలు జరుగుతాయని తెలిపారు. ఆ రోజు తెల్లవారుజాము 2.30 గంటలకు నాగపుట్ట పూజ, మూడు గంటలకు స్వామివారికి పంచామృత అభి షేకాలు చేసిన అనంతరం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. పుట్టలో పాలుపోసి స్వామిని దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. దేవస్థానం భక్తులకు ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు, చిన్న పిల్లలకు పాలు, భక్తులకు మజ్జిగ పంపిణీ చేస్తామని, వృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లులకు ప్రత్యేక దర్శనం, విజయవాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, రేపల్లె డిపోల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాగుల చవితి రోజున ఆర్జీత సేవలు ఉండవని, స్వామి శాంతి కల్యాణం ఉదయం 11 గంటలకు జరుగుతుందని వివరించారు.





