News

“కనెక్టింగ్ భారత్’’ అంటూ బీఎస్ఎన్ఎల్ కొత్త లోగో…

259views

ప్రభుత్వ టెలికం రంగ సంస్థ భారతీయ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) సంస్థ లోగోలో మార్పులు చేసింది. కొత్తగా 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న కంపెనీ కొత్త లోగోను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. గతంలో కనెక్టింగ్ ఇండియా అని వుండేది. ఇప్పుడు కనెక్టింగ్ భారత్ అని రాసుకుంది. ఇక… గతంలో లోగో రెడ్, బ్లూ, యాష్ కలర్లో వుండేది. తాజాగా లోగోలో కాషాయం, తెలుపు, గ్రీన్ కలర్స్ తో లోగో రూపొందించారు. దీనికి సంబంధించిన కార్యక్రమం భారత్ సంచార్ భవన్ లో జరిగింది.

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.తమ సంస్థ ప్రధాన లక్ష్యాలకు అనుగుణంగానే కొత్త లోగోను రూపొందించామని అధికారులు తెలిపారు. ఇది కేవలం లోగో మాత్రమే కాదని, తమ సంస్థ దృష్టికోణాన్ని వెల్లడిస్తోందని తెలిపారు. లోగోలో ఆకుపచ్చ మరియు తెలుపు బాణాలు తమ సంస్థ సమగ్ర దేశవ్యాప్త ఉనికిని నొక్కి చెబుతున్నాయని, మారుమూల ప్రాంతాలకి కూడా సేవలందిస్తామన్న సంకేతాలిస్తోందని వివరించారు. ప్రస్తుతం దేశంలోని ఎంపిక చేసిన సర్కిల్స్‌లో 4 సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 4జీ సేవలను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.

ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ నూతన లోగో బీఎస్ఎన్ఎల్ తదుపరి లక్ష్యాలు, రాబోయే దశలను సూచిస్తోందని తెలిపారు. భారత్ కి సాంకేతికతను అందించడంలో సంస్థ ముందుంటుందని పేర్కొన్నారు.కనెక్టింగ్ ఇండియా నుంచి కనెక్టింగ్ భారత్ అని రాశారని, అన్ని వర్గాల వారికి అందుబాటులో వుంటుందన్న అర్థం వస్తుందని, అందరికీ కనెక్ట్ అవుతుందన్న అర్థం వస్తుందని, ఇందులో ఆర్థిక, సామాజిక భేదాలుండవి వివరించారు.