News

ఆలయం ఎదుట మద్యం దుకాణం వద్దంటూ ఆందోళన

386views

కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో ప్రభాకర్‌ థియేటర్‌ సమీపంలో కొలువైన శంభులింగేశ్వరస్వామి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని మూసివేయాలని విరాఠ్‌ హిందూస్థాన్‌ సంఘం నాయకులు, భక్తులు, కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. ఆదోని ఎక్సైజ్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ.. ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తుంటారన్నారు. మద్యం దుకాణం ఏర్పాటు చేయడంతో ఆలయానికి వచ్చే భక్తులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్న మద్యం దుకాణాన్ని ఆలయ సమీపం నుంచి తొలగించాలని డిమాండు చేశారు. అనంతరం ఎక్సైజ్‌ సీఐ సైదుల్‌తో వాగ్వాదానికి దిగారు. మద్యం దుకాణం మూసివేసేంత వరకు కదిలేది లేదని భీష్మించారు. స్పందించిన సీఐ మద్యం దుకాణాన్ని మూసివేసి ఇతర ప్రాంతానికి తరలిస్తామని చెప్పడంతో భక్తులు, కాలనీ వాసులు శాంతించారు. జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్‌ అడివేశ్, నర్సప్ప, శంబులింగే శైలేంద్ర గురస్వామి, కిశోర్, తాయన్న తదితరులు పాల్గొన్నారు.