News

విద్యార్థి స్వామి మాలధారణపై అభ్యంతరం

255views

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని టేలర్‌ ఎయిడెడ్‌ హైస్కూల్‌ వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న లంక యశ్వంత్‌ స్వామి మాలధారణతో పాఠశాలకు వచ్చాడు. మధ్యాహ్నం బిక్ష ఉందని.. పర్మిషన్‌ కావాలని టీచర్‌ కోమలిని కోరగా ఆమె ఇలా మాల వేసుకుని స్కూలుకు రావడం ఏంటని ప్రశ్నించిందంటూ విద్యార్థి ఇంటికి వెళ్లి తల్లితండ్రులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విశ్వ హిందూ పరిషత్వీహెచ్‌పీ నాయకులు ఉలిసి నాగేంద్ర, కటికిరెడ్డి రవికుమార్‌ మరికొందరు స్వాములు స్కూల్‌ వద్ద ఆందోళనకు దిగారు. టీచర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఐ బి.యాదగిరి సిబ్బందితో కలసి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. స్కూల్‌ సెక్రటరీ పోతుల జగన్‌ వివాదంపై ఆరా తీశారు. తాను తప్పు ఉద్దేశంతో అనలేదని పిల్లలు తప్పుగా అర్ధంచేసుకున్నారని టీచర్‌ వివరించారు. అయితే తనకున్న అధికారంతో టీచర్‌ను మూడురోజులపాటు సస్పెండ్‌ చేస్తున్నట్టు సెక్రటరీ ప్రకటించారు. దీంతో ఆందోళన విరమించారు.