News

కెనడా అనవసర ఆరోపణలతోనే ఉద్రిక్తత పెరిగింది: భారత్‌

235views

ఎలాంటి ఆధారాల్లేకుండానే కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భారత్‌పై నిందలు వేస్తున్న విషయం ఆయన మాటల్లోనే తేటతెల్లమైందని విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) పేర్కొంది. సిక్కు వేర్పాటువాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో మనకు ఎలాంటి సంబంధం లేదని మొదటి నుంచి చెబుతూ వస్తున్నామని, నిఘా వర్గాల సమాచారం తప్పిస్తే పక్కా ఆధారాల్లేవని ఇప్పుడు స్వయానా ట్రూడోయే అంగీకరించారని ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ గుర్తుచేశారు. ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశంపైనా, దౌత్యవేత్తలపైనా కెనడా తీవ్రమైన ఆరోపణలు చేసినా ఇంతవరకు ఎలాంటి ఆధారాలను చూపలేకపోయిందని పునరుద్ఘాటించారు. ట్రూడో సర్కారు చేస్తున్న ఆరోపణల వల్లనే రెండుదేశాల సంబంధాల్లో ఉద్రిక్తత పెరిగిందని చెప్పారు. కెనడా మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదని విమర్శించారు. ‘ఒకే భారత్‌’ (వన్‌ ఇండియా) విధానంపై నమ్మకం ఉందంటూ ట్రూడో చెప్పడాన్ని ఖండించారు. గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్య కేసులో అమెరికా ఇచ్చిన సమాచారాన్ని తీవ్రంగానే తీసుకున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా నిజ్జర్‌ హత్య కేసులో గతేడాది భారత్‌పై ట్రూడో ఆరోపణల తర్వాత.. నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ నుంచి ఆయనకు ఓ లేఖ వచ్చింది. అదిప్పుడు వైరల్‌గా మారింది. నిజ్జర్‌ హత్యలో భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ పాత్ర ఉందని ఆరోపిస్తూ, ఆయనను బహిష్కరించాలని ఆ లేఖలో పన్నూ కోరాడు. అలా జరగకపోతే.. కెనడాలో చురుకుగా ఉన్న భారత ఏజెంట్ల చేతుల్లో మరికొంతమందికి హాని జరగొచ్చని భయపడుతున్నామని అందులో పేర్కొన్నాడు.