
ఈ ప్రపంచానికి మనం పరిచయమవడానికి కారణం తల్లిదండ్రులు. వారి సేవను మించిన పవిత్ర కార్యం వేరేదీ లేదు. కన్నవారిని ఆవేదనకు, అశాంతికి గురిచేస్తే అంతకు మించిన పాపం మరొకటి ఉండదు. సాక్షాత్తు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తమ తొలిప్రాధాన్యం తల్లిదండ్రులకే ఇచ్చారు. ‘మాతృదేవోభవ… పితృదేవోభవ’ అన్న ఉపనిషత్ వాక్యాలు మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తున్న మహితోక్తులు.
‘తల్లిదండ్రులను దుఃఖపెట్టేవారి ఆధ్యాత్మిక సాధనలు ఫలించవు. కన్నవారు సంతృప్తిగా ఉన్నప్పుడే మన పూజలు, పుణ్యతీర్థయాత్రలు సార్థకమవుతాయి’ అనేవారు రామకృష్ణ పరమహంస. ఆయన తన వద్దకు వచ్చే భక్తులను, శిష్యులను వారి తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకునేవారు. ‘మీరు వారిని చక్కగా చూసుకుంటున్నారా?’ అని వాకబు చేసేవారు. హాజ్రా అనే వ్యక్తి తల్లి బాగోగులు చూసుకోకుండా, పరమహంస చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు. విషయం తెలిసిన వెంటనే ఆ భక్తుడిని బలవంతంగా స్వగ్రామం పంపారు. ఆమె సంతోషంగా ఉన్నప్పుడే తిరిగి రమ్మన్నారు. శిరిడీ సాయి సైతం తన భక్తులు కన్నవారిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రంగా హెచ్చరించేవారు. ఇంటి పరిస్థితులు చక్కదిద్దుకొన్నాకే ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడమనేవారు.
ప్రత్యక్ష దైవాలు
‘మాతరం పితరం దైవ సాక్షాత్ ప్రత్యక్ష దేవతామ్।
మత్వా గృహీ నిషేవేత సదా సర్వ ప్రయత్నతః।।
అంటుంది మన సనాతన ధర్మం. నవమాసాలు మోసి జన్మనిచ్చి, కంటికి రెప్పలా కాపాడే తల్లి ఇలలో మొదటి దైవం. ఇహపరాలు సాధించేందుకు విద్యాబుద్ధులను నేర్పించి, స్వశక్తిపై ఆధారపడేలా తీర్చిదిద్దే తండ్రి రెండో దైవం. ఆ ప్రత్యక్షదైవాలను సదా సేవించడమే బిడ్డల కర్తవ్యం అన్నది దీని భావం. పిల్లల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఎన్ని కష్టాలనైనా ఆనందంగా అనుభవించే తల్లిదండ్రుల రుణం వందల ఏళ్లు శ్రమించినా తీర్చకోలేనిదని పెద్దలు చెబుతారు.
కేవలం దేహాన్నివ్వడం, ధనాన్ని సమకూర్చడమే కాదు, కన్నబిడ్డలు ధార్మిక మార్గంలో ప్రయాణించడానికి సాయపడే తల్లిదండ్రులు ధన్యులు. లోకం మొత్తం ఇలాంటి వారికి రుణపడి ఉంటుంది. ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడితో ‘హరి చేరుమనియెడి తండ్రి తండ్రి!’ అని విస్పష్టం చేశాడు. భగవంతుడి వైపు మనసును మరలించే తండ్రే అసలైన తండ్రి అని ఉద్ఘాటించాడు. చిన్ననాటి నుంచే ధార్మిక, దైవిక భావాల్ని పిల్లలకు నూరిపోస్తే వారు ఆధ్యాత్మిక సుసంపన్నులవుతారని శ్రీమద్భాగవతం, రామాయణం, మహాభారతం లాంటివి ప్రబోధిస్తున్నాయి.
అందుకే లోకాభిరాముడు!
తల్లిదండ్రులను తూలనాడటం మహాపాపమని సనాతన ధర్మం ఘోషిస్తోంది. వారితో అభిప్రాయ భేదాలున్నా, వాదవివాదాలకు దిగితే అంతకు మించిన అనైతికం మరొకటి లేదన్నారు మన మహర్షులు. తండ్రిగా దశరథుడు తనకు ఎంతో అన్యాయం చేశాడని, ప్రతిఘటించమని లోకం ప్రేరేపించినా ఆ దశరథాత్మజుడు ససేమిరా అన్నాడు. ‘తల్లిదండ్రులు నాకు దైవసమానులు. నా పినతల్లి కైక సైతం నాకు పూజ్యురాలు. వారి మాటే నాకు శిరోధార్యం’ అని ఉద్ఘాటించాడు. అందుకే లోకాభిరాముడయ్యాడు.
కృష్ణుడి ప్రేమ
కంసుడి చెరసాల నుంచి దేవకీ వసుదేవులను విడిపించిన తరవాత బలరామకృష్ణులు వారికి పాదాభివందనం చేసి, ‘మేము ఇన్నాళ్లు మీ ప్రేమ, ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు. ధర్మార్థకామ మోక్షాలనే పురుషార్థాలను సాధించడానికి అవసరమైన ఈ దేహాన్ని ప్రసాదించినవారు మీరు. అలాంటి దుర్లభమైన మానవదేహాన్ని ఇచ్చిన మీ రుణం తీర్చుకోవడానికి మాకు నూరేళ్లయినా సరిపోవు’ అని కృతజ్ఞతలు చెప్పారు. శ్రీకృష్ణుడు రేపల్లెలో తనను పెంచి పెద్దచేసిన నందుడు, యశోదలపైనా అపారమైన ప్రేమాభిమానాలను చాటుకొన్నాడు. వారిని వదిలి మథురకు పయనమైనప్పుడు యశోద, నందుడు ఏకధాటిగా రోదించారు. స్థితప్రజ్ఞతకు మారుపేరైన శ్రీకృష్ణుడు సైతం ఆ పెంచిన ప్రేమకు, వారి పరివేదనకు కదిలిపోయాడు. అదే భావనను తన సఖుడు ఉద్ధవుడితో పంచుకుంటూ ‘ఉద్ధవా! నా కన్నయ్య భోజనం చేస్తేగానీ నేను పచ్చి మంచినీళ్లయినా ముట్టను అని మొండి పట్టుదలతో కూర్చొనే నా తల్లి యశోదమ్మను, అలాగే నన్ను భుజాలపై మోసిన నా తండ్రి నందుడిని మరవలేకపోతున్నాను’ అని మథనపడిపోయాడు. ఇలా అవతార పురుషులు సైతం తల్లిదండ్రులకు మహోన్నతమైన స్థానాన్నిచ్చారు. కన్నవారిని ఆదరిస్తే ఆ భగవంతుణ్ని ఆరాధించినట్లేనని నిరూపించారు.
చెదపురుగులతో సమానం!
ఔద్ధత్యం పరిహాసం చ తర్జనం పరిభాషణమ్।
పితురగ్రే న కుర్వీత యదిచ్ఛేదాత్మనో హితమ్।।
పిల్లలు తల్లిదండ్రులను దుర్భాషలాడటం, అవమానించడం, బాధ కలిగించటం, నిందారోపణలు చేయడం మంచిది కాదు. జన్మనిచ్చినవారిని అవమానించి అగౌరవపరిచిన వారికి ఎన్నటికీ మేలు జరగదు అన్నది శాస్త్రవచనం. యోగి వేమన మరింత ఘాటుగా తల్లిదండ్రుల మీద దయచూపని కొడుకులను పుట్టలో పుట్టి గిట్టే చెదపురుగులతో పోల్చాడు.
శ్రవణుడు ఆదర్శం
కన్నవారిని సేవించి కైవల్యాన్ని పొందిన శ్రవణుడి లాంటి పాత్రను ప్రపంచ ఆధ్యాత్మిక సారస్వతంలో ఎక్కడా దర్శించలేం. అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోసుకొని అతడు తీర్థయాత్రలు చేయించాడు. తను జీవితంలో ఎలాంటి కఠినమైన ఆధ్యాత్మిక సాధనలు చేయకున్నా, కేవలం ఈ ఒక్క ‘సేవ’ అతడి జన్మను ధన్యం చేసింది. శ్రవణుడి అడుగుజాడల్లో నడుస్తూ కన్నవారిని కంటికిరెప్పలా కాపాడుకొంటున్న బిడ్డల గురించి సామాజిక మాధ్యమాల్లో తరచూ చూస్తుంటాం. అలాంటి వారు ప్రతిఒక్కరికీ స్ఫూర్తిప్రదాతలు. మన పురాణకథల్లో సాక్షాత్తు వినాయకుడు తల్లిదండ్రులైన శివపార్వతులకు ప్రదక్షిణం చేసి, జన్మనిచ్చినవారిని సేవించుకోవడాన్ని మించిన తీర్థయాత్ర మరొకటి లేదని చెప్పకనే చెప్పాడు.





