
మసీదు లోపల జై శ్రీరామ్ అన్న నినాదాలు చేసినందుకు నమోదైన క్రిమినల్ కేసును కర్నాటక హైకోర్టు కొట్టేసింది. మసీదులో జై శ్రీరాం అని నినాదాలు చేసినందుకు ఐపీసీ సెక్షన్ 295ఏ కింద నేరం చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసును కొట్టేసింది.ఈ ఘటన ఏ మత భావాలను, ఏ సమాజ భావాలను దెబ్బతీయలేదని, అందుకే సెక్షన్ 295ఏ కింద నేరంగా పరిగణించలేమని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని రోజుల క్రితం దక్షిణ కన్నడ జిల్లాకి చెందిన ఇద్దరు రాత్రిపూట స్థానిక మసీదులోకి ప్రవేశించి జైశ్రీరాం అని నినాదాలు చేసినందుకు అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఐపీసీ 295ఏ (మతపరమైన భావాలు దెబ్బతీసినందుకు), 447, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
దీంతో తమపై నమోదైన కేసును కొట్టేయాలంటూ నిందితులు హైకోర్టుకెక్కారు. జైశ్రీరాం అంటూ నినాదాలు చేయడం ఏమత విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య కాదని నిందితుల తరపు న్యాయవాది వాదించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు సరిగ్గా లేవని, అక్కడికి అనుగుణంగా లేవని న్యాయవాది కోర్టులో వాదించారు.దీంతో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నినాదం ఏ వర్గానికి చెందిన మతపరమైన భావాలను ఎలా రెచ్చగొడుతుందో అసలు అర్థమే కావడం లేదని పేర్కొంది.ఈ ప్రాంతంలో హిందూ ముస్లింలు సామరస్యంగా జీవిస్తున్నారని ఫిర్యాదుదారు స్వయంగా చెప్పారని, ఈ సంఘటన ఎంతమాత్రమూ విరోధానికి దారితీయదని హైకోర్టు తెలిపింది.





