
రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ -సిసిఎస్ ఆమోదం తెలిపింది. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థలను పరీక్షించడం, ముఖ్యంగా రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. గాల్లోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ, యాంటి ట్యాంక్ క్షిపణులు, వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థలను పర్యవేక్షించనున్నట్లు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ-డిఆర్‌డిఒ ఓ ప్రకటనలో తెలిపింది.ఇది ఇలా ఉండగా కృష్ణా జిల్లాలో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఇది కృష్ణా జిల్లాకు గర్వకారణమని,. దేశ రక్షణా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ కేంద్రం ముఖ్యపాత్ర పోషిస్తుందని సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు.





