News

గురుడి చందమామ యూరోపా శోధనకు వ్యోమనౌక

273views

గురుగ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్న యూరోపా అనే చందమామపై జీవుల మనుగడకు అనువైన పరిస్థితులు ఉన్నాయా అని శోధించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా సోమవారం ఒక వ్యోమనౌకను ప్రయోగించింది. ఫ్లోరిడాలోని అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. యూరోపా క్లిపర్‌ అనే వ్యోమనౌక.. 300 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి గురు గ్రహాన్ని చేరుతుంది. ఇందుకు ఐదున్నరేళ్లు పడుతుంది.

గురుగ్రహ కక్ష్యలోకి చేరాక యూరోపా క్లిపర్‌.. 49 సార్లు యూరోపాకు చేరువగా వచ్చి వెళుతుంది. హిమమయంగా ఉండే ఈ చందమామ ఉపరితలం కింద భారీ సముద్రం ఉండొచ్చని, అక్కడి నీటిలో జీవుల మనుగడకు అవసరమైన వాతావరణం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. అందువల్ల సౌర కుటుంబంలో జీవాన్వేషణకు ఈ చందమామను అత్యంత అనువైన ప్రదేశంగా పరిగణిస్తుంటారు. అయితే అక్కడ జీవం కోసం యూరోపా క్లిపర్‌ శోధించబోదని, జీవుల మనుగడకు అవసరమైన అంశాలు ఉన్నాయా అన్నది మాత్రమే పరిశీలిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. యూరోపా క్లిపర్‌ బరువు 5,700 కిలోలు. ఈ ప్రాజెక్టు వ్యయం 520 కోట్ల డాలర్లు.

గురు గ్రహం చుట్టూ భారీగా రేడియోధార్మికత ఉంటుంది. యూరోపాకు చేరువగా వచ్చిన ప్రతిసారీ.. ఛాతీ ఎక్స్‌రే కన్నా కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా రేడియోధార్మికతను యూరోపా క్లిపర్‌ ఎదుర్కొంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యోమనౌక ట్రాన్సిస్టర్లు దెబ్బతినవచ్చని నాసా చాలా ఆలస్యంగా గుర్తించింది. దీంతో ఈ ప్రాజెక్టుపై మరోసారి సమీక్ష జరిపి, గత నెలలో దీన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసింది. యూరోపా క్లిపర్‌.. ప్రతి 21 రోజులకోసారి గురు గ్రహాన్ని చుట్టేస్తుంది. ఇది గరిష్ఠంగా యూరోపా ఉపరితలానికి 25 కిలోమీటర్ల దూరం వరకూ వెళుతుంది. వ్యోమనౌకలోని రాడార్‌… ఆ చందమామపై 24 కిలోమీటర్ల మందంలో ఉన్న మంచు పొర కిందున్న సాగరాన్ని పరిశోధిస్తుంది. 2030లో అది గురుగ్రహాన్ని చేరుతుంది.