
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో ఏకంగా భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మను చేర్చి న్యూదిల్లీతో కయ్యానికి కాలుదువ్విన కెనడా (Canada).. తాజాగా మళ్లీ నోరుపారేసుకుంది. ఈసారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును తెర పైకి తెచ్చి భారత్‌పై బురద జల్లే ప్రయత్నం చేసింది. ఆ గ్యాంగ్‌తో కలిసి భారత ఏజెంట్లు.. ప్రో ఖలీస్థానీలను లక్ష్యంగా చేసుకొని కెనడా భూభాగంపై పని చేస్తున్నారంటూ తీవ్రంగా ఆరోపించింది.
నిజ్జర్ హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు పురోగతి వివరాలను రాయల్ కెనడియన్ మౌంటెడ్ (RCMP) పోలీసులు సోమవారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) మీడియాకు వివరించారు. ఈసందర్భంగా ఆర్‌సీఎంపీ అసిస్టెంట్ కమిషనర్ బ్రిగిట్టె గౌవిన్ మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘కెనడాలోని దక్షిణాసియా కమ్యూనిటీని ముఖ్యంగా ప్రో-ఖలిస్థానీలను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు. వీరు కొన్ని గ్రూప్‌ల సాయంతో మా భూభాగంపై వ్యవస్థీకృత నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకించి బిష్ణోయ్ గ్రూప్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ఈ గ్యాంగ్‌కు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని మేం విశ్వసిస్తున్నాం’’ అని గౌవిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ ఆరోపణలకు కూడా ఒట్టావా ఎలాంటి ఆధారాలను పంచుకోలేదు.
ఇదిలాఉండగా.. నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మను చేర్చడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మళ్లీ భగ్గుమన్నాయి. దీనిపై తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో న్యూదిల్లీపై మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు భారత్ సహకరించడం లేదని ఆరోపించారు. అయితే, కెనడా ఆరోపణలు న్యూదిల్లీ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. ఎలాంటి సాక్ష్యాలు ఇవ్వకుండా ఒట్టావా నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడింది.





