News

పకడ్బందీగా ‘కార్తిక’ ఏర్పాట్లు

412views

శ్రీశైల మహాక్షేత్రంలో నవంబరు 2 నుంచి డిసెంబరు 1వ తేది వరకు నిర్వహించే కార్తీక మాసోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని దేవస్థాన ఈఓ డి.పెద్దిరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్‌.రమణమ్మ, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అన్ని విభాగాల యూనిట్‌ అధికారులు, పర్యవేక్షకులు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజీనాయక్‌, శ్రీశైలం సీఐ ప్రసాదరావు, చంద్రబాబు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ఈఓ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 31లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, పౌర్ణమి, శుద్ధ బహుళ ఏకాదశి, ప్రభుత్వ సెలవురోజుల్లో భక్తులరద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాతాళగంగ వద్ద శౌచాలయాలు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, మెట్లమార్గంలో, గంగాభవానీ స్నానఘట్టాల్లో అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. కార్తీక మాసం రద్దీ రోజుల్లో కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. వేకువజామున 3గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాతఃకాల పూజల అనంతరం 4.30గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దర్శనాలు, తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. కార్తీక మాసమంతా స్వామివారి గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. కార్తీకదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తరమాఢవీధిలో, గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, పాతాళగంగ వద్ద పుణ్యనదీహారతి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.